ఫ్యామిలీ మొత్తాన్ని దఫదఫాలుగా చంపేసింది…

కేరళలో ఒక సంచలనాత్మక నేరం వెలుగు చూసింది. ఒక మహిళ ఆస్తి కోసం, ఆధిపత్యం కోసం ఫ్యామిలీలో ఆరుగురిని హత్య చేసింది. 2002 నుంచి 2016 వరకు విడతల వారీగా కుటుంబసభ్యులను కడతేర్చింది. ఆహారంలో విషం కలిపి చంపేయడం, గుండెపోటు అని నమ్మించడం ఆమె అలవాటు.

కేరళలోని కొజికోట్‌లో ఈ ఘటన జరిగింది. తొలుత అందరివీ సహజమరణాలే అనుకున్నారు. కానీ హంతకురాలు ఆస్తి వాటా కోసం అనుమానాస్పదంగా వ్యవహరించడంతో మరిది ఫిర్యాదుతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. సమాధులను తవ్వి వాటిని పరీక్షించగా శరీరాల్లో సైనైడ్‌ ఆనవాళ్లు కనిపించాయి.

టామ్ థామస్‌ అనే వ్యక్తి స్థానికంగా ఉన్నతమైన వ్యక్తి. అతడి భార్య పేరు అన్నమ్మ థామస్. వీరి కోడలే హంతకురాలు జాలీ. మామ ఆస్తిపై కన్నేసిన జాలీ… తొలుత అతడిని హత్య చేయాలనుకుంది. కానీ అలా చేస్తే ఆస్తి తన అత్త పేరున వెళ్తుందని భావించి తొలుత అత్తనే హత్య చేసేందుకు ప్లాన్ చేసుకుంది. 57 ఏళ్ల అత్త అన్నమ్మ థామస్‌కు ఆహారంలో సైనైడ్‌ కలిపి పెట్టింది. దాంతో ఆమె కుప్పకూలి చనిపోయింది. అందరూ ఆమెది సహజమరణం అనుకున్నారు. ఆ తర్వాత మామ టామ్ థామస్‌ను కూడా ఇలాగే విషం ఇచ్చి చంపేసింది. వయసు మీద పడడంతో ఆయనది కూడా సహజ మరణమే అనుకున్నారు. 2002లో అత్త హత్య జరగ్గా… 2008లో మామను హత్య చేసింది.

తర్వాత భర్తను టార్గెట్ చేసింది. మిత్రులతో ఎక్కువగా ఉంటూ తన మాట వినడంలేదన్న కోపంతో భర్తను చంపేయాలనుకుంది. అతడికి కూడా ఆహారంలో విషం కలిపి చంపేసింది. చనిపోయే సమయానికి జాలీ భర్త రాయ్‌ థామస్ వయసు 44 ఏళ్లు. అనుమానం వచ్చిన రాయ్‌ థామస్ మేనమామ… రాయ్‌ థామస్ మృతదేహానికి పోస్టు మార్టం చేయాలని పట్టుపట్టారు. కానీ జాలీ అందుకు అంగీకరించకపోవడంతో ఏమీ చేయలేకపోయారు. భర్త హత్య 2011లో జరిగింది.

పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేసిన రాయ్ మేనమామ మాథ్యూకు తనపై అనుమానం మొదలైందని గ్రహించిన జాలీ… అతడిని కూడా అదే తరహాలో చంపేసింది. ఆమె హత్యల పరంపర ఆగలేదు. వారి బంధువుల్లో ఒకరైన సిలీ కాపురంపై జాలీ కన్నేసింది. సిలీ భర్తను రెండో వివాహం చేసుకోవాలని నిర్ణయించుకున్న జాలీ… సిలీని, ఆమె రెండేళ్ల కుమార్తెను కూడా ఆహారంలో విషం కలిపి చంపేసింది. అనంతరం సిలీ భర్తను జాలీ పెళ్లి చేసుకుంది.

ఇలా ఆరు హత్యలు చేసిన తర్వాత మామ ఆస్తిలో వాటా కోసం కోర్టుకెక్కింది. దాంతో జాలీ తీరుపై అమెరికాలో ఉన్న మరిదికి అనుమానం వచ్చింది. తన ఇంట్లో వరుసగా ఒకే రీతిలో జరిగిన హత్యలపై విచారణ జరిపించాలని పోలీసులను కోరారు. రంగంలోకి దిగిన పోలీసులు ఒకేచోట ఖననం చేసిన మృతదేహాలను వెలికి తీసి పరీక్షించారు. ఆరు మృతదేహాల్లోనూ సైనైడ్‌ ఉన్నట్టు నిపుణులు గుర్తించారు.

పాలిగ్రాఫ్ పరీక్షలకు రావాల్సిందిగా జాలీని పోలీసులు కోరగా ఆమె అందుకు నిరాకరించింది. అనుమానాస్పదంగా వ్యవహరించడం మొదలుపెట్టింది. దాంతో గట్టిగా దృష్టిసారించిన పోలీసులు జాలీకి సహకరించిన ఆమె రెండో భర్తను, సైనైడ్‌ సరఫరా చేసిన వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దాంతో మొత్తం వ్యవహారం బయటపడింది. జాలీతో పాటు ఆమె రెండో భర్త, సైనైడ్‌ సరఫరా చేసిన మరో వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు.