అఖిల్ సరసన కామాక్షి

ఇండస్ట్రీలో సమంత, పూజా హెగ్డే, రాశిఖన్నా, రకుల్, కీర్తిసురేష్ లాంటి చాలామంది హీరోయిన్లు ఉన్నారు. మరి కామాక్షి ఎవరు? ఇప్పుడీ ముద్దుగుమ్మ అఖిల్ సరసన ఓ సినిమాలో నటించబోతోంది.? అవును.. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో కామాక్షి హీరోయిన్ గా నటిస్తోంది. మెయిన్ హీరోయిన్ పూజా హెగ్డే అయితే, సెకెండ్ హీరోయిన్ కామాక్షి అన్నమాట.

ఇంతకీ ఈ కామాక్షి ఎవరో తెలుసా? ఈమె మిస్ తెలంగాణ 2018, పైగా మాజీ మిస్ ఇండియా ఫైనలిస్ట్. అన్నింటికీ మించి తెలుగమ్మాయి. ఈ అమ్మాయిని ఇప్పుడీ సినిమాలోకి తీసుకున్నారు. ఇన్నాళ్లూ మోడలింగ్ లో ఉన్న కామాక్షికి ఇదే తొలి తెలుగు సినిమా. త్వరలోనే ఈమె సెట్స్ పైకి రాబోతోంది.

అఖిల్ కెరీర్ లో నాలుగో చిత్రంగా ఇది తెరకెక్కుతోంది. ఈ మూవీలో హీరోయిన్ కోసం చాన్నాళ్లుగా ప్రయత్నించిన విషయం తెలిసిందే. ఎట్టకేలకు కాస్త భారీ రెమ్యూనరేషన్ ఇచ్చి పూజా హెగ్డేను ఫిక్స్ చేశారు. ఆమె రావడంతో సినిమా షూటింగ్ ఊపందుకుంది.

మిగతా నటీనటుల్ని కూడా వెంటవెంటనే ఎంపిక చేసి, షూటింగ్ ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇందులో భాగంగానే కామాక్షి ఎంపిక జరిగింది. సినిమాలో ఈమెది చాలా చిన్న పాత్ర అయినప్పటికీ, కథను మలుపుతిప్పే సన్నివేశంలో వస్తుందని చెబుతున్నారు. ఈ సినిమాతో బొమ్మరిల్లు భాస్కర్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు. గోపీసుందర్ సంగీతం అందిస్తున్నాడు.