జగన్‌ వీటిని పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు…

జూపూడి ప్రభాకర్ రావుని వైసీపీలోకి తీసుకోవడంపై ఆ పార్టీ అభిమానులే కొందరు విమర్శిస్తున్నారు. కష్టకాలంలో పార్టీని వదిలేసి వెళ్లి టీడీపీలో చేరిన వ్యక్తిని తిరిగి ఎలా పార్టీలోకి తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. వారి ఆవేదనలో అర్థమున్నా… జగన్ కొన్ని ప్రత్యేక కారణాలతో జూపూడి ఎంట్రీకి ఓకే చేసి ఉండవచ్చు.

జగన్ పార్టీ పెట్టిన సమయంలో జూపూడి ఎమ్మెల్సీగా ఉండేవారు. కాంగ్రెస్‌ను కాదని జగన్‌ వెంట నడిచారు. 2014 ఎన్నికల తర్వాత ఆయన టీడీపీలో చేరారు గానీ.. అంతకుముందు వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా ఐదారేళ్ల పాటు ఆ పార్టీకి సేవలందించారు. బహుశా ఈ అంశాన్ని జగన్ పరిగణనలోకి తీసుకుని ఉండవచ్చు.

విశాఖ ఎయిర్‌పోర్టులో జగన్‌పై హత్యాయత్నం డ్రామా అని చంద్రబాబు, టీడీపీ నేతలు విమర్శించినప్పుడు … జూపూడి మాత్రం అందుకు భిన్నంగా స్పందించారు.

తనపై తానే సానుభూతి కోసం హత్యాయత్నం చేయించుకునేంత చీప్ క్యారెక్టర్ జగన్‌ది కాదు అని టీడీపీలోనే ఉంటూ జూపూడి వాదించారు. అదే సమయంలో జూపూడి వాయిస్‌ పార్టీ వాణి వినిపించేందుకు పనికొస్తుందని జగన్ భావించి ఉండవచ్చు. జూపూడిని పార్టీలోకి ఆహ్వానించడం ద్వారా టీడీపీలోని ఇతర నేతలకు కూడా ”మీరూ రావొచ్చు” అన్న సంకేతాలను జగన్ పంపినట్టుగా ఉంది.

పార్టీలో చేరిన సందర్భంగా కూడా జూపూడి తనను తాను దారి తప్పిన గొర్రె పిల్లగా అభివర్ణించుకున్నారు. తన వైపు నుంచి తప్పులు జరిగాయని…. వాటిని సరిదిద్దుకుంటానని చెప్పారు. విజయసాయిరెడ్డిని ఈ సందర్భంగా ఆంధ్రా ఐరన్ మ్యాన్ అని జూపూడి ప్రభాకర్ ప్రశసించారు.