రాహుల్‌ ప్రైవసీ పర్యటనలకు మోడీ సర్కార్ చెక్

స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్- ఎస్పీజీ భద్రతలో ఉన్న వీవీఐపీలకు కేంద్రం షాక్ ఇచ్చింది. ఇకపై వారి ఇష్టానికి పర్యటనలు చేయడానికి వీల్లేకుండా ఆంక్షలు విధించింది. ఎస్పీజీ భద్రత ఉన్న వారు రహస్యంగా పర్యటనలు చేయడానికి వీల్లేకుండా చెక్ పెట్టింది కేంద్రం. ఇకపై ఎస్పీజీ భద్రత ఉన్న వారు ఎక్కడికి వెళ్లినా, విదేశాలకు వెళ్లినా, వ్యక్తిగత పర్యటనలకు వెళ్లినా వారి వెంట ఎస్పీజీ సిబ్బంది తప్పనిసరి అని స్పష్టం చేసింది.

ఒకవేళ ఎస్పీజీ భద్రతలో ఉన్న వారు విదేశాల్లో తమ వెంట భద్రతా సిబ్బందిని నిరాకరిస్తే అప్పుడు సదరు పర్యటనను కేంద్ర ప్రభుత్వం కుదించనుంది. ఈ కొత్త ఆంక్షల లక్ష్యం గాంధీ ఫ్యామిలీనే అన్న విమర్శలు వస్తున్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ హఠాత్తుగా విదేశాలకు చెక్కేస్తున్నారు. వెంట ఎస్పీజీ ని తీసుకెళ్లడం లేదు.

ఇటీవల కంబోడియాకు రాహుల్ గాంధీ అలాగే చెప్పా పెట్టకుండా వెళ్లిపోయారు. గతంలో యూరప్, అమెరికా పర్యటనలను అలాగే చేశారు. ఎస్పీజీ భద్రతలో ఉన్న వీవీఐపీల ప్రైవసీని దృష్టిలో ఉంచుకుని వారి ప్రయాణం వరకు , గమ్యస్థానం చేరే వరకు ఎస్పీజీ భద్రతా సిబ్బంది ఫాలో అయ్యే వారు. వీవీఐపీలు గమ్యస్థానం చేరిన తర్వాత వెనక్కు వచ్చేవారు.

కేంద్రం కొత్తగా తీసుకున్న నిర్ణయం కారణంగా ఇకపై ప్రైవసీ పేరుతో ఎస్పీజీ ని దూరంగా పెట్టేందుకు వీలులేదు. అణుక్షణం వెంట ఎస్పీజీ ఉంటుంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం సోనియా, రాహుల్‌ లక్ష్యంగానే జరిగిందని కాంగ్రెస్‌ ఆరోపిస్తోంది. రాహుల్‌ గాంధీ, సోనియా గాంధీపై అణుక్షణం నిఘా ఉంచేందుకు ఇలాంటి ఎత్తులను మోడీ ప్రభుత్వం వేస్తోందని కాంగ్రెస్ ఆరోపిస్తోంది.