సోలో బతుకే సో బెటర్ అంటున్న సాయితేజ్

చిత్రలహరి సక్సెస్ తర్వాత సాయితేజ్ స్పీడ్ పెంచాడు. ఓవైపు ఆల్రెడీ వచ్చిన గ్యాప్ ను భర్తీ చేయడంతో పాటు, మరోవైపు వచ్చిన సక్సెస్ ను కొనసాగించాలనే కసితో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నాడు ఈ మెగా హీరో. ఈ క్రమంలో తాజాగా మరో సినిమాను లాంచ్ చేశాడు. సుబ్బు అనే వ్యక్తిని పరిచయం చేస్తూ కొత్త సినిమా లాంఛ్ చేశాడు సాయితేజ్.

బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మాతగా తెరకెక్కబోతున్న ఈ సినిమాకు ‘సోలో బతుకే సో బెటర్’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. లాంఛింగ్ రోజునే టైటిల్ లోగోను కూడా విడుదల చేశారు. ఇస్మార్ట్ శంకర్ తో హిట్ అందుకున్న నభా నటేష్ ను ఈ సినిమాలో హీరోయిన్ గా తీసుకున్నారు. తమన్ ను సంగీత దర్శకుడిగా తీసుకున్నారు. నిజానికి సెంటిమెంట్ కొద్దీ ఈ సినిమాకు దేవిశ్రీప్రసాద్ నే మరోసారి తీసుకోవాలని సాయితేజ్ భావించాడు. కానీ దేవిశ్రీ బిజీ. అందుకే తమన్ తో ఎడ్జెస్ట్ అవుతున్నారు.

ప్రస్తుతం మారుతి దర్శకత్వంలో ‘ప్రతిరోజూ పండగే’ అనే సినిమా చేస్తున్నాడు సాయితేజ్. ఈ మూవీ షూటింగ్ దాదాపు 75శాతం పూర్తయింది. మిగతా పెండింగ్ వర్క్ కంప్లీట్ అయిన వెంటనే సుబ్బు దర్శకత్వంలో సినిమా సెట్స్ పైకి వస్తుంది. అన్నీ అనుకున్నట్టు జరిగితే నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఉంటుంది. ఈ మూవీతో పాటు మరో మూవీని కూడా స్టార్ట్ చేసే ప్లాన్ లో ఉన్నాడు సాయితేజ్.