వీళ్లకు అన్నీ మంచి శకునములే

ఓ బేబీ సినిమాతో మళ్లీ ట్రాక్ పైకొచ్చింది దర్శకురాలు నందినీరెడ్డి. ఈ సినిమా సక్సెస్ తో ఆమెను ఇప్పుడు మరో ఆఫర్ వరించింది. స్వప్న సినిమాస్ బ్యానర్ పై నందినీరెడ్డి సినిమా ఫిక్స్ అయింది.

దసరా సందర్భంగా ఈ సినిమాను అధికారికంగా ప్రకటించారు. అశ్వనీదత్ కుమార్తెలు.. స్వప్న దత్, ప్రియాంక దత్ కలిసి ఈ సినిమాను నిర్మించబోతున్నారు. ఈ సినిమాకు అన్నీ మంచి శకునములే అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

`మ‌హాన‌టి`, `ఓ బేబీ` చిత్రాల‌కు అద్భుత‌మైన సంగీతాన్ని అందించిన మిక్కీ జె.మేయ‌ర్ ఈ సినిమాకు సంగీత సార‌థ్యం వ‌హించ‌నున్నారు. ఓ బేబీకి వర్క్ చేసిన ల‌క్ష్మీ భూపాల్, ఈ సినిమాకు కూడా ర‌చయిత‌గా ప‌నిచేస్తున్నారు. జ‌య‌శ్రీ ఆర్ట్ వ‌ర్క్‌ను అందిస్తుండ‌గా.. రిచ‌ర్డ్ ప్ర‌సాద్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు.

ఈ సినిమాలో నటించే హీరోహీరోయిన్ల వివరాల్ని త్వరలోనే వెల్లడించబోతున్నారు. నిజానికి ఈరోజు హీరో పేరును ప్రకటించాలని అనుకున్నారు. కానీ వీలు పడలేదు.

ఎందుకంటే, ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో విజయ్ దేవరకొండను హీరోగా అనుకున్నారు. స్వప్న సినిమాస్ నిర్మాతలు విజయ్ దేవరకొండకు ఆల్రెడీ అడ్వాన్స్ ఇచ్చారు. కానీ ఈ కథ విజయ్ దేవరకొండకు నచ్చలేదు. దీంతో మరో హీరో కోసం ప్రయత్నిస్తున్నారు. త్వరలోనే ఆ హీరో ఎవరనేది తేలిపోతుంది.