నాగచైతన్యకి వేట నేర్పిస్తున్న ‘వెంకీ మామ’

వెంకటేష్ మరియు అక్కినేని నాగచైతన్య కలిసి నటిస్తున్న మొట్టమొదటి మల్టీస్టారర్ సినిమా ‘వెంకీమామ’. కె.ఎస్.రవీంద్ర అలియాస్ బాబీ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేష్ సరసన పాయల్ రాజ్ పుత్ హీరోయిన్ గా నటిస్తుండగా నాగచైతన్యతో రాశిఖన్నా రొమాన్స్ చేస్తుంది.

తాజాగా ఈచిత్రానికి సంబంధించిన ఫస్ట్ గ్లింప్స్ ను దసరా సందర్భంగా విడుదల చేశారు దర్శక నిర్మాతలు. కేవలం 40 సెకండ్ల నిడివి ఉన్న ఈ వీడియో చూస్తే సినిమాలో నాగచైతన్య వెంకటేష్ మేనల్లుడి పాత్రలో కనిపించనున్నాడని తెలుస్తోంది.

“గోదావరి లో ఈత నేర్పా, బరిలో ఆట నేర్పా, ఇప్పుడు జాతరలో వేట నేర్పిస్తారా రారా అల్లుడు” అంటూ వెంకటేష్ మరియు నాగ చైతన్య కలిసి రౌడీల దుమ్ము దులుపుతూ కనిపిస్తారు.

ఇక ఈ సినిమాలో వెంకటేష్ ట్రేడ్ మార్క్ కామెడీ కూడా ఉంటుందని కూడా తెలుస్తోంది. ఈ సినిమాలో వెంకటేష్ మరియు నాగచైతన్య ల మధ్య ఉండే బంధం చాలా అద్భుతంగా తెరకెక్కించారని తెలుస్తోంది. సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై సురేష్ బాబు నిర్మిస్తున్న ఈ సినిమాకి ఎస్.ఎస్ తమన్ సంగీతాన్ని అందిస్తున్నారు.