వైసీపీలోకి జూపూడి ప్రభాకర్‌…

వైసీపీలోకి వలసలు కొనసాగుతున్నాయి. టీడీపీ అధికార ప్రతినిధి, ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్‌ జూపూడి ప్రభాకర్ తిరిగి వైసీపీలో చేరుతున్నారు. జగన్‌ సమక్షంలో ఆయన వైసీపీ కండువా కప్పుకోనున్నారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున ప్రకాశం జిల్లా కొండేపి నుంచి పోటీ చేసిన జూపూడి ప్రభాకర్ ఓడిపోయారు. ఆ తర్వాత టీడీపీలో చేరారు.

ఎమ్మెల్సీ పదవి ఆశించినా చంద్రబాబు ఇవ్వలేదు. ఎస్సీ కార్పొరేషన్ పదవితో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఇటీవల ఎన్నికల్లో టీడీపీ ఓడిపోవడం, జూపూడికి ప్రాధాన్యత తగ్గడంతో ఆయన తిరిగి వైసీపీలో చేరుతున్నారు.

ఎన్నికల్లో టీడీపీ ఓటమిపై మేథోమథనం సందర్భంగా జూపూడి లేవనెత్తిన అంశాలను చంద్రబాబు తోసి పుచ్చారు. ప్రసంగాన్ని మధ్యలోనే ఆపించారు. దాంతో అప్పటి నుంచి జూపూడి టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.

జూపూడితో పాటు ఇటీవల జనసేనకు రాజీనామా చేసిన మాజీ ఎమ్మెల్యే ఆకుల సత్యనారాయణ కూడా వైసీపీలో చేరనున్నారు. ఆయనకు రాజమండ్రి సిటీ వైసీపీ ఇన్‌చార్జ్‌గా బాధ్యతలు అప్పగించే అవకాశం ఉంది.