చింతమనేని పై మరో కేసు…

దెందులూరు ఎమ్మెల్యేగా టీడీపీ హయాంలో ఓ సామంత రాజ్యాన్ని నడిపాడు చింతమనేని ప్రభాకర్. ఇతడి ఆగడాలను కళ్లుండి చూడలేని దృతరాష్ట్రుడిగా సీఎం చంద్రబాబు మౌనమునిగా ఉండిపోయాడు. కానీ పాపం పండింది. వైసీపీ అధికారంలోకి వచ్చింది. అదే దూకుడు చూపించాడు. బాధితులు కేసు పెట్టారు. పోలీసులు జైలుకు పంపారు.

సెప్టెంబర్ 11న అరెస్ట్ అయ్యి జైల్లో రిమాండ్ లో ఉన్న చింతమనేనిపై గతంలో ఉన్న పలు తీవ్ర కేసులు బయటకు వస్తున్నాయి. అతడిపై నమోదైన పెండింగ్ కేసులన్నింటిని పోలీసులు వెలికి తీస్తున్నారు. పీటీ కేసుల్లో వారెంట్ లతో పోలీసులు మళ్లీ మళ్లీ అరెస్ట్ లు చేస్తున్నారు.

తాజాగా సోమవారం ఉదయం పోలవరం కుడికట్టు కాలువ మట్టి తరలింపుపై ఫిర్యాదు చేసిన మాజీ సర్పంచ్ ను… ఇంటికి వెళ్లి మరీ చిత్రహింసలకు పాల్పడ్డ చింతమనేనిపై సోమవారం పిటీ వారెంట్ జారీ అయ్యింది. దీంతో కోర్టులో హాజరుపరుచగా.. రిమాండ్ విధించారు.

వైసీపీ ప్రభుత్వం వచ్చాక…. చింతమనేనికి వ్యతిరేకంగా ఆయన బాధితులంతా రోడ్డెక్కడంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. భార్యకు అనారోగ్యం వెంటాడడంతో ఇంటికి రాగా పోలీసులు అరెస్ట్ చేశారు. కాగా ఈ కేసుల్లో చింతమనేని బెయిల్ కోసం అప్పీలు చేసుకోగా.. వరుసగా కేసులు, రిమాండ్ లు, అరెస్ట్ లతో కోర్టులు బెయిల్ నిరాకరిస్తున్నాయి.

ఇలా చింతమనేని టీడీపీ ప్రభుత్వంలో చేసిన ఆగడాలకు ఇప్పుడు వరుస కేసులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నాడు. ప్రతీరోజు ఏదో ఒక కేసు.. అరెస్ట్… రిమాండ్ తో చింతమనేని ఇక పూర్తిగా జైలుకే పరిమితం అయ్యేలా ఉన్నాడు.