బీజేపీ వ్యతిరేకతపైనే కాంగ్రెస్ ఆశ…?

ఈనెల 21న మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రెండు రాష్ట్రాల్లోనూ బీజేపీయే అధికారంలో ఉంది. అయితే అతిపెద్ద రాష్ట్రమైన మహారాష్ట్రలో బీజేపీని భయం వెంటాడుతోందన్న విశ్లేషణలు సాగుతున్నాయి..

మహారాష్ట్రలో మొదట 170 స్థానాల్లో పోటీచేయాలని భావించిన బీజేపీ ఇప్పుడు ఆ సంఖ్యను 150కు తగ్గించుకోవడం చూసి ఈ అనుమానాలకు బలం చేకూరుతోంది. మరో 20 స్థానాలను మిత్రపక్షమైన శివసేనకు ఇవ్వడంతో బీజేపీ వ్యతిరేకతకు దూరంగా ఉండాలనే ఈ పనిచేసిందన్న ఊహాగానాలు వ్యక్తమవుతున్నాయి..

మహారాష్ట్రలో రైతుల నిరసన దేశవ్యాప్తంగా కలకలం రేపింది. ఇక మొన్నటి ఎండాకాలంలో కరువు, నీటి సమస్య ప్రజల్లో ఆగ్రహావేశాలు పెంచింది. అయితే మహారాష్ట్రలో బీజేపీకి ప్రధానబలం.. అక్కడ ప్రతిపక్ష కాంగ్రెస్, ఎన్సీపీలు బలంగా లేకపోవడమే.

ఇప్పటికే కాంగ్రెస్, ఎన్సీపీ నేతలను లాగేసిన బీజేపీ బలంగా ఉండగా.. నడిపించే నాయకుడు రాహుల్ విదేశాలకు డిప్రెషన్ తో పయనమయ్యాడు. దీంతో చుక్కాని లేని నావలా ఉన్న కాంగ్రెస్ పడవను మహారాష్ట్రలో నడిపే నాయకుడే లేడు. అయితే బీజేపీపై ఆగ్రహం… కాంగ్రెస్ ను గెలిపిస్తుందన్న ఆశ ఆ పార్టీ నాయకుల్లో ఉంది.