పోలీసుల చేజింగ్… తప్పించుకుని పారిపోయిన అఖిలప్రియ భర్త

మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌ రాం నాయుడు పై మరో కేసు నమోదైంది. ఇదివరకే నమోదైన కేసుల్లో ఆయన్ను అరెస్ట్ చేసేందుకు పోలీసులు ప్రయత్నించగా సినీ పక్కిలో తప్పించుకున్నాడు. పోలీసులు భార్గవ్‌ రాం కారును చేజ్ చేయగా… కళ్లు గప్పి పారిపోయాడు. దాంతో ఆళ్లగడ్డ ఎస్‌ఐ… హైదరాబాద్‌ గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

భార్య ఫ్యామిలీ బ్యాగ్రౌండ్‌ను బేస్ చేసుకుని ఆళ్లగడ్డలో దందాలు, దౌర్జన్యాలు చేస్తున్న భార్గవ్‌ రాం పై ఇప్పటికే పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. కొద్దిరోజుల క్రితం అఖిలప్రియ కుటుంబంతో వ్యాపార భాగస్వామిగా ఉన్న శివరామిరెడ్డిని బెదిరించడంతో పాటు అనుచరులతో కలిసి దాడి చేశాడు భార్గవ్ రాం. వాటాలు వదులుకుని క్రషర్ ఫ్యాక్టరీ మొత్తం తమకు అప్పగించాలంటూ భార్గవ్‌ రాం నాయుడు… శివరామిరెడ్డిపై దాడి చేశాడు. దాంతో శివరామిరెడ్డి భార్య ఫిర్యాదు మేరకు భార్గవ్‌ రాం పై ఆళ్లగడ్డ పోలీసులు కేసులు నమోదు చేశారు.

ఆ కేసులో భాగంగా భార్గవ్‌ రాంను అరెస్ట్ చేసేందుకు ఆళ్లగడ్డ ఎస్‌ఐ ఆధ్వర్యంలో పోలీసులు హైదరాబాద్ వచ్చారు. ఫార్చునర్‌ కారును స్వయంగా నడుపుకుంటూ వెళ్తున్న భార్గవ్‌ రాంను గుర్తించిన పోలీసులు ఆయన్ను ఆపేందుకు ప్రయత్నించారు. కానీ ఆగకుండా వెళ్లిపోయాడు. దాంతో పోలీసులు కారును చేజ్ చేశారు.

పోలీసులు తనను వెంబడిస్తున్నారని గుర్తించిన భార్గవ్‌ రాం మరింత వేగంగా కారును నడిపాడు. గచ్చిబౌలిలోని ఓక్ వుడ్ హోటల్ వద్ద భార్గవ్ కారు ఆపాడు. దాంతో పోలీసులు తమ వాహనం దిగి వస్తుండగా… అంతలోనే మళ్లీ వేగంగా కారులో దూసుకుపోయాడు. పోలీసులను బురిడి కొట్టించడానికి భార్గవ్‌ రాం ఇలా చేశాడు. ఆ సమయంలో పోలీసుల మీదకు కారును వేగంగా మళ్లించడంతో పోలీసులు హడలిపోయారు.

భార్గవ్‌ రాం నాయుడు తీరుపై గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో ఆళ్లగడ్డ పోలీసులు ఫిర్యాదు చేశారు. తమ విధులకు ఆటంకం కలిగించడంతో పాటు… కారుతో తమను ఢీకొట్టేందుకు ప్రయత్నించాడని ఫిర్యాదు చేశారు పోలీసులు. దాంతో ఐపీసీ సెక్షన్ 353, 336 సెక్షన్ల కింద పోలీసులు భార్గవ్‌ రాం పై కేసు నమోదు చేశారు.

ఆళ్లగడ్డ ప్రాంతంలో శాంతిభద్రతల సమస్య తలెత్తేలా వ్యవహరించే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని కర్నూలు జిల్లా పోలీసులు చెబుతున్నారు.