వికలాంగ భక్తుడిని దర్శనానికి తీసుకెళ్లిన ఏపీ డిప్యూటీ సీఎం

ఏపీ డిప్యూటీ సీఎం, ఎక్సైజ్ శాఖ మంత్రి నారాయణస్వామి ఒక సామాన్య భక్తుడి కోసం ప్రోటోకాల్‌ను కాసేపు పక్కనపెట్టారు. అందరి మన్ననలు పొందారు. విజయవాడ దుర్గమ్మ దర్శనానికి వచ్చిన డిప్యూటీ సీఎం … అక్కడే క్యూలైన్‌లో ఉన్న ఒక వికలాంగుడిని గమనించారు. క్యూలైన్లో ఇబ్బందిపడుతున్న వికలాంగుడి వద్దకు వెళ్లి క్యూలైన్ నుంచి బయటకు తీసుకొచ్చారు.

తనతో పాటు నేరుగా అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లారు. తన పక్కనే నిలబెట్టుకుని అమ్మవారి దర్శనం చేయించారు. దర్శనం తర్వాత ఆలయం బయటకు వచ్చే వరకు మంత్రి సిబ్బంది సదరు వికలాంగుడిని జాగ్రత్తగా చూసుకున్నారు. క్యూలైన్‌లో ఉన్న తనను స్వయంగా డిప్యూటీ సీఎం పిలిచి అమ్మవారి దర్శనానికి తీసుకెళ్లడంపై సదరు భక్తుడు ఆశ్చర్యానికి, అమితానందానికి లోనయ్యాడు.

డిప్యూటీ సీఎంతో పాటు అమ్మవారిని దర్శించుకున్న వ్యక్తి స్వస్థలం శ్రీకాకుళం జిల్లా. భవానీ మాల ధరించిన అతడు దీక్ష విరమించేందుకు దుర్గమ్మ సన్నిధికి వచ్చాడు.