మరో వివాదంలో హార్ధిక్ పాండ్యా

  • పాండ్యాకు నెటిజన్ల లెప్ట్-రైట్
  • జహీర్ ఖాన్ పుట్టినరోజు ట్విట్ తెచ్చిన తంటా

భారత వివాదాస్పద ఆల్ రౌండర్ హార్థిక్ పాండ్యా మరో వివాదంలో చిక్కుకొన్నాడు. వెన్నెముకగాయానికి లండన్ లో ఆపరేషన్ చేయించుకొని విశ్రాంతి తీసుకొంటున్న హార్థిక్ పాండ్యా…తనకు గురువులాంటి జహీర్ ఖాన్ కు ట్విట్టర్ ద్వారా అనుచిత రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పి మరీ…కోరికష్టాలు కొని తెచ్చుకొన్నాడు.

గతంలో నిర్వహించిన ఓ టీవీ టాక్ షోలో రాహుల్ తో కలసి మహిళలు, యువతుల పట్ల చెత్తవ్యాఖ్యలు చేయడం ద్వారా సస్పెన్షన్ కు గురికావడంతో పాటు… తీవ్రవిమర్శలు ఎదుర్కొన్న హార్థిక్ పాండ్యా…గత అనుభవాల నుంచి ఏమాత్రం పాఠాలు నేర్చుకోలేదని తేలిపోయింది.

భారత దిగ్గజ ఫాస్ట్ బౌలర్ గా, అపార అనుభవం ఉన్న… తనకు గురువులాంటి జహీర్ ఖాన్ కు…పుట్టినరోజునాడు ఓ వీడియో క్లిప్ ను జత చేసి మరీ ట్విట్ చేశాడు.

జహీర్ ఖాన్ బౌలింగ్ లో తాను కొట్టిన సిక్సర్ షాట్ క్లిప్ ను జత చేసి…తాను సిక్సర్ బాదినట్లుగానే జహీర్ జీవితం ఉండాలంటూ శుభాకాంక్షలు తెలపడం… నెటిజన్లకు తీవ్ర ఆగ్రహాన్ని తెప్పించింది.

9వ తరగతితో చదువు ఆపేసిన హార్ధిక్ పాండ్యా కు తనకు గురువులాంటి జహీర్ ఖాన్ తో ఎలా మెలగాలో…ఎంత గౌరవంగా ఉండాలో తెలియదని… ఉన్నత చదువులు చదివిన జహీర్ ఖాన్ తో…9వ తరగతి తప్పిన హార్థిక్ పాండ్యా కాస్త సంస్కారం నేర్చుకోవాలని నెటిజన్లు హితవు పలికారు.

క్రికెట్ ఫీల్డ్ లో ప్రతిభ చూపడంతోనే గౌరవం రాదని.. .వ్యక్తిత్వం కూడా ముఖ్యమేనని చురకలు అంటించారు.

క్రికెటర్ గా కోట్ల రూపాయలు ఆర్జించిన హార్థిక్ పాండ్యా… ఇక ముందైనా తన దూకుడు తగ్గించి…ప్రవర్తన మార్చుకోక పోతే… కెరియర్ కే ముప్పు వచ్చే ప్రమాదం లేకపోలేదు.