పూణే టెస్టుకు స్పోర్టివ్ పిచ్

  • బ్యాటింగ్ తో పాటు పేస్ బౌలర్లకూ అనుకూలం
  • 10 నుంచి పూణే వేదికగా సౌతాఫ్రికాతో రెండోటెస్ట్

సౌతాఫ్రికాతో తీన్మార్ టెస్ట్ సిరీస్ లో భాగంగా పూణేలోని మహారాష్ట్ర్ర క్రికెట్ సంఘం స్టేడియం వేదికగా ఈ నెల 10 నుంచి జరిగే రెండోటెస్ట్ మ్యాచ్ కు.. స్పోర్టివ్ పిచ్ ను సిద్ధం చేసినట్లు స్టేడియం క్యూరేటర్ పాండురంగ సల్గోంకర్ తెలిపారు.

రెండేళ్ల క్రితం ఆస్ట్ర్రేలియాతో పూణే వేదికగా జరిగిన టెస్ట్ మ్యాచ్ కేవలం మూడురోజుల ముచ్చటగానే ముగిసింది. ఈ మ్యాచ్ లో ఆతిథ్య భారత్ ఘోరపరాజయం చవిచూసింది.

అంతేకాదు …రెండుజట్ల స్పిన్నర్లు కలసి 31 వికెట్లు పడగొట్టడంతో తీవ్రవిమర్శలు ఎదుర్కొనాల్సి వచ్చింది. ఐసీసీ సైతం పూణే వికెట్ ను నాసిరకం పిచ్ గా నిర్ణయించడం …పూణే స్టేడియం ప్రతిష్టను దెబ్బతీసింది.

అయితే …గత అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ప్రస్తుత టెస్ట్ మ్యాచ్ కోసం పూణే వికెట్ ను సిద్ధం చేసినట్లు తెలిపారు.
2,3 రోజుల్లోనే బ్యాటింగ్ కు అనుకూలం.. ఇటీవల కురిసిన భారీవర్షాలు, పూణే నగరంలో వీస్తున్న శీతలగాలులతో..పిచ్ పేస్ బౌలర్లకు అనువుగా ఉంటుందని..ఆట మొదటి రోజు బ్యాట్స్ మన్ సత్తాకు సవాలు కానుందని…రెండు, మూడురోజుల ఆటలో బ్యాటింగ్ కు అనువుగా ఉంటుందని, చివరి రెండురోజులు బౌలర్లదే పైచేయిగా ఉంటుందని క్యూరేటర్ చెప్పారు.

ఇసుక, మట్టిమిశ్రమంతో పూణే స్టేడియం అవుట్ ఫీల్డ్ ను తయారు చేయడంతో…నీటిని పీల్చుకొనే గుణం అధికమని…వర్షం పడినా నీరు త్వరగానే ఇంకిపోయే ఏర్పాటు ఉందని వివరించారు. 

ప్రస్తుత మూడుమ్యాచ్ ల సిరీస్ లో భాగంగా విశాఖ వేదికగా ముగిసిన తొలిటెస్టులో భారత్ భారీవిజయం సాధించడం ద్వారా 1-0 ఆధిక్యం సాధించడంతో.. పూణే టెస్ట్ మ్యాచ్ మూడో ర్యాంక్ సౌతాఫ్రికాకు డూ ఆర్ డైగా మారింది.