కేసీఆర్‌కు తలవంచుతా

సంగారెడ్డి ప్రజల కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ వద్ద తల వంచేందుకు కూడా తాను సిద్ధమని చెప్పారు ఎమ్మెల్యే జగ్గారెడ్డి. తనను పవర్‌తో, పైసలతో ఎవరూ లొంగదీసుకోలేరని వ్యాఖ్యానించారు.

కేవలం సంగారెడ్డితో మెడికల్ కాలేజీ కోసం, నిరుద్యోగుల ఉపాధి కోసం, నియోజకవర్గం అభివృద్ధి కోసం కేసీఆర్ వద్ద తలవంచేందుకు సిద్దపడ్డానన్నారు.

కేసీఆర్‌ తమ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తే జీవితాంతం రుణపడి ఉంటామన్నారు. సంగారెడ్డిలో జరిగిన దసరా ఉత్సవాల్లో పాల్గొన్న ఆయన…2014లో ఓడిపోయిన తర్వాత నాలుగేళ్ల పాటు అనేక ఇబ్బందులు, అవమానాలను తాను చవిచూశానన్నారు.

తిరిగి ఇటీవల ఎన్నికల్లో తనను గెలిపించి సంగారెడ్డి ప్రజలు తనకు రాజకీయంగా తిరిగి ప్రాణం పోశారన్నారు. కాబట్టి ఇక్కడి ప్రజల కోసం ఏమైనా చేస్తానని… కేసీఆర్‌ వద్ద తల వంచేందుకు కూడా సిద్ధమని చెప్పారు.

ఐదేళ్ల వయసులోనే తాను తండ్రిని కోల్పోయానని… తన తల్లి కష్టపడి పెంచిందన్నారు. కానీ తనను ఎమ్మెల్యేగా చూడకుండానే తన తల్లి చనిపోయిందన్నారు. చనిపోవడానికి ముందు రెండేళ్ల పాటు తన తల్లి తీవ్ర అనారోగ్యంతో అనేక ఇబ్బందులు పడిందని చెప్పారు. ఆ సమయంలో చేతిలో డబ్బులు లేక, అమ్మ అనారోగ్యంతో ఉండడం చూసి తట్టుకోలేకపోయానన్నారు. ఏడాది పాటు తన తల్లికి సేవ చేశానని చెప్పారు.

పిల్లలు వారివారి తల్లిదండ్రుల పట్ల మానవత్వంతో వ్యవహరించాలని కోరారు. తల్లిదండ్రులను ఇంటి వద్దే ఉంచుకుని బాగా చూసుకోవాలని కోరారు. బతికి ఉన్నప్పుడు తల్లిదండ్రులకు సేవ చేయాలి గానీ… వారు చనిపోయిన తర్వాత ఫోటోలకు పూజలు చేస్తే ఉపయోగం ఉండదన్నారు.

ప్రతి మనిషి ఏదో ఒక రోజు వృద్ధుడు కాకతప్పదని… అందరూ పైకిపోక తప్పదని.. కాబట్టి బతికి ఉన్నప్పుడు మానవత్వంతో ఉండాలని… ఏదీ శాశ్వతం కాదన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని నియోజకవర్గ ప్రజలకు జగ్గారెడ్డి సూచించారు.