అన్నీ పుకార్లే.. ఆర్-ఆర్-ఆర్ క్లారిటీ

దసరా సందర్భంగా నిన్నంతా అన్ని స్టిల్స్ తో పాటు ఆర్-ఆర్-ఆర్ టైటిల్ లోగో కూడా జోరుగా తిరిగింది. ఇంకా చెప్పాలంటే మిగతా స్టిల్స్ కంటే ఆర్-ఆర్-ఆర్ పోస్టరే ఎక్కువగా వైరల్ అయింది. అయితే ఇది నిజమైన పోస్టర్ కాదు. ఆ టైటిల్ కూడా ఒరిజినల్ కాదు. ఈ రోజు ఈ విషయాన్ని మేకర్స్ తాపీగా బయటపెట్టారు.

ఆర్-ఆర్-ఆర్ అంటే రామ రౌద్ర రుషితం అంటూ ఓ పేరు బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది. దాదాపు 3 రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఆ టైటిల్ తో ఎవరో మంచి పోస్టర్ తయారుచేశారు. అదే ఒరిజినల్ టైటిల్ అంటూ సోషల్ మీడియాలో పోస్టర్ పెట్టారు. చూస్తుంటే.. అచ్చం ఒరిజినల్ గా అనిపించడంతో ఇక అంతా షేర్లు చేయడం స్టార్ట్ చేశారు.

దీంతో చాలామంది అదే ఒరిజినల్ అనుకున్నారు. రాజమౌళి సినిమా టైటిల్ ను ఇంత సైలెంట్ గా రివీల్ చేయడం ఏంటంటూ కొందరు ఆశ్చర్యం కూడా వ్యక్తంచేశారు. వాళ్ల ఆశ్చర్యమే నిజమైంది. ఆ టైటిల్ తో తమకు ఎలాంటి సంబంధం లేదని యూనిట్ క్లారిటీ ఇచ్చింది. ఇంకా చెప్పాలంటే ఆర్-ఆర్-ఆర్ కు ఇంకా టైటిల్ ఫిక్స్ చేయలేదని కూడా ప్రకటించింది. దీంతో వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది.