ఆర్థిక ఇబ్బందుల్లో ఐక్యరాజ్యసమితి… పలు సమావేశాలు వాయిదా

ఐక్యరాజ్యసమితిని ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. సభ్యదేశాల నుంచి సరైన నిధులు రాకపోవడంతో ఖర్చులకు కూడా కటకట ఏర్పడింది. ఐక్యరాజ్యసమితి ఆర్థిక కష్టాలను స్వయంగా సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరస్‌ వెల్లడించారు. ఆర్థిక ఇబ్బందులను వివరిస్తూ ఐక్యరాజ్యసమితి సచివాలయంలో పనిచేసే 37 వేల మందికి లేఖ రాశారాయన.

2019లో సాధారణ బడ్జెట్‌కు వివిధ సభ్యదేశాల నుంచి 70 శాతం నిధులు మాత్రమే వచ్చాయని లేఖలో వివరించారు. దీంతో సెప్టెంబర్‌ చివరకి 230 మిలియన్ డాలర్ల లోటు ఏర్పడిందని వివరించారు. ఉన్న నిధులు కూడా ఈనెలాఖరుకు అయిపోయే అవకాశం ఉందన్నారు. కాబట్టి ఖర్చులను భారీగా తగ్గించుకోవాల్సి వస్తోందన్నారు.

నిధుల ఇబ్బంది కారణంగా వివిధ సమావేశాలను, సదస్సులను వాయిదా వేస్తున్నట్టు ఆయన ప్రకటించారు. మరీ అవసరం అయితే తప్ప పర్యటనలకు అనుమతి ఇచ్చే అవకాశం లేదని చెప్పారు. సేవా కార్యక్రమాలను కూడా తగ్గిస్తామని వెల్లడించారు. ఐక్యరాజ్యసమితి ఇలా నిధుల ఇబ్బందులు ఎదుర్కోవడానికి సభ్యదేశాల నిర్లక్ష్యమే ప్రధాన కారణమని ఆయన ఆరోపించారు.

నిధుల కొరతను ముందే ఊహించి గుటెరస్‌ సభ్యదేశాలను హెచ్చరించినా ఫలితం లేకపోయింది. 2018-19లో ఐక్యరాజ్యసమితి 5.4 బిలియన్ డాలర్ల బడ్జెట్‌ను పెట్టింది. ఇందులో 22 శాతం అమెరికా నుంచే ఐక్యరాజ్యసమితికి అందాయి.