సీనయ్యగా మారిన వీవీ వినాయక్

దర్శకుడు వీవీ వినాయక్ సీనయ్యగా మారాడు. అతడు హీరోగా మారాడు అనే కంటే సీనయ్యగా మారాడని చెప్పడమే కరెక్ట్. ఎందుకంటే ఇది హీరోయిజం చూపించే కథ కాదు. కాన్సెప్ట్ బేస్డ్ స్టోరీ. ఆ సినిమాకు సీనయ్య అనే టైటిల్ పెట్టారు. అందుకే వినాయక్ ను అంతా ఇప్పుడు సీనయ్యగా పిలుస్తున్నారు. ఈ సినిమా లాంఛ్ ఈరోజు గ్రాండ్ గా జరిగింది. ఈరోజు వినాయక్ పుట్టినరోజు కూడా కావడంతో మరింత కలర్ ఫుల్ గా జరిగింది.

హైదరాబాద్ అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమానికి చాలామంది ప్రముఖులు హాజరయ్యారు. చిత్రం ముహూర్తపు షాట్‌కి దర్శకేంద్రుడు కె రాఘవేంద్రరావు క్లాప్ నివ్వగా సూపర్ డైరెక్టర్ కొరటాల శివ కెమెరా స్విచాన్ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ దర్శకులు సుకుమార్, వంశీ పైడిపల్లి, అనిల్ రావిపూడి, మెహర్ రమేష్, ప్రముఖ నిర్మాతలు బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్, సి. కళ్యాణ్, దానయ్య డి.వి.వి,అనీల్ సుంకర, బెల్లంకొండ సురేష్, బెక్కం వేణుగోపాల్, వల్లభనేని వంశీ తదితరులు పాల్గొన్నారు.

1982-84 బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌ ఇది. సీన‌య్య అనే వ్య‌క్తి క‌థ‌. కంప్లీట్ ఎమోష‌న‌ల్ స్టోరి. మ‌ణిశ‌ర్మ‌ సంగీతం అందిస్తున్నాడు. సాయిశ్రీరామ్‌ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నాడు. ఆర్టిస్టుల్లో ఎస్టాబ్లిష్డ్ అయినవారు త‌క్కువ‌గా, కొత్త‌వాళ్లు ఎక్కువ‌గా ఉంటారు. ఈ సినిమా కోసం వినాయక్ రోజుకు 4 గంటలు జిమ్ చేసి సన్నబడ్డాడు. వచ్చే ఏడాది సమ్మర్ లో థియేటర్లలోకి రాబోతున్నాడు సీనయ్య.