10లక్షలు దాటితే రివర్స్‌… జగన్ మరో కీలక నిర్ణయం

రివర్స్ టెండరింగ్ విధానంతో పోలవరం ప్రాజెక్టులో 782 కోట్లు ఆదా అయిన నేపథ్యంలో ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌ రెడ్డి రివర్స్‌ విధానానికి మరింత పదును పెడుతున్నారు.

ఇందులో భాగంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇకపై 10 లక్షలు, ఆపైబడిన పనులకు కూడా రివర్స్ టెండరింగ్ నిర్వహించాలని నిర్ణయించారు. 10లక్షలు, ఆపై విలువ ఉన్న పనులకు గానీ, సేవలకు గానీ, వస్తువుల కొనుగోళ్లకు గానీ బిడ్డింగ్ నిర్వహించి, ఆ తర్వాత రివర్స్‌ టెండరింగ్‌ నిర్వహించాలని నిర్ణయించారు.

ఈ కొత్త విధానం జనవరి 1 నుంచి అమలులోకి వచ్చేలా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

రివర్స్ టెండరింగ్ విధానాన్ని మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకు మరో కీలక నిర్ణయం కూడా తీసుకున్నారు. రివర్స్ టెండరింగ్‌లో కనీసం ఐదుగురు కాంట్రాక్టర్లు లేదా మొదటి 60 శాతం మందికి మాత్రమే అర్హత ఉన్నట్టు గుర్తించాలని నిర్ణయించారు.

అంటే బిడ్డింగ్‌లో 10 మంది పాల్గొంటే ఎల్‌1 నుంచి ఎల్‌6 వరకు వచ్చిన వారిని మాత్రమే రివర్స్‌ టెండరింగ్‌కు అవకాశం ఇస్తారు. పనుల్లో నాణ్యత దెబ్బతినకుండా చూసేందుకు ఈనిర్ణయం తీసుకున్నట్టు చెబుతున్నారు. వాస్తవికతకు విరుద్దంగా బిడ్డింగ్‌ వేసే వారిని అడ్డుకునేందుకు ఈ ఆలోచన పనికొస్తుంది.

ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్ల టెండర్లలో ఇ–ప్రొక్యూర్‌మెంట్, జ్యుడిషియల్‌ ప్రివ్యూ, రివర్స్‌ టెండరింగ్‌ పక్రియలు సాఫీగా జరిగేలా సహకారం అందించేందుకు ప్రత్యేకంగా ఒక ఐఏఎస్‌ అధికారిని నియమించాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ప్రభుత్వ సర్వీసులు, పనులు, కొనుగోళ్లను పరిశీలిస్తూ రివర్స్‌ టెండరింగ్‌ సాఫీగా కొనసాగేలా చూడాల్సిన బాధ్యత సదరు ఐఏఎస్‌పై ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.