పూణే టెస్టులోనూ భారత బ్యాటింగ్ జోరు

  • బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో మయాంక్ షో

ఐసీసీ టెస్ట్ చాంపియన్షిప్ లీగ్ లో భాగంగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడుమ్యాచ్ ల సిరీస్ లోని రెండోటెస్ట్ తొలిరోజు ఆటలో భారత్ బ్యాటింగ్ హవానే కొనసాగింది.

విశాఖ టెస్టును 203 పరుగులతేడాతో నెగ్గిన ఆత్మవిశ్వాసంతో …పూణే వేదికగా ప్రారంభమైన రెండోటెస్ట్ ను భారత్ ప్రారంభించింది.

ఈ మ్యాచ్ లో ముందుగా కీలక టాస్ నెగ్గిన భారత్ మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ ఎంచుకొంది. తుదిజట్టులో ఒకే ఒక్క మార్పుతో సమరానికి సిద్ధమయ్యింది.

ఎక్స్ ట్రా బ్యాట్స్ మన్ హనుమ విహారీని తప్పించి…ఎక్స్ ట్రా బౌలర్ గా ఉమేశ్ యాదవ్ కు తుదిజట్టులో చోటు కల్పించింది.

మయాంక్ మరో సూపర్ సెంచరీ…

తొలి టెస్టులో బ్యాక్ టు బ్యాక్ సెంచరీలతో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచిన ఓపెనర్ రోహిత్ శర్మ…కేవలం 14 పరుగులకే రబాడా బౌలింగ్ లో అవుట్ కావడంతో.. మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ తో కలసి వన్ డౌన్ చతేశ్వర్ పూజారా రెండో వికెట్ కు సెంచరీ భాగస్వామ్యంతో…భారీ స్కోరుకు పునాది వేశాడు.

పూజారా 112 బాల్స్ లో ఓ సిక్సర్, 9 బౌండ్రీలతో 58 పరుగులకు అవుట్ కాగా…తొలిటెస్ట్ తొలిఇన్నింగ్స్ సెంచరీ హీరో మయాంక్ అగర్వాల్..అదే దూకుడు కొనసాగించి… వరుసగా రెండో శతకం పూర్తిచేశాడు.

మయాంక్ మొత్తం 195 బాల్స్ ఎదుర్కొని 16 బౌండ్రీలు, 2 సిక్సర్లతో 108 పరుగులకు రబాడా బౌలింగ్ లోనే దొరికిపోడంతో భారత్ మూడోవికెట్ నష్టపోయింది.

50 టెస్టుల కెప్టెన్ విరాట్ కొహ్లీ…

కెప్టెన్ గా తన 50వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న సారథి విరాట్ కొహ్లీ బాధ్యతాయుతంగా ఆడి…వైస్ కెప్టెన్ అజింక్యా రహానేతో కలసి 4వ వికెట్ కు అజేయ హాఫ్ సెంచరీ భాగస్వామ్యం నమోదు చేశాడు.

ఈ క్రమంలో కొహ్లీ…టెస్ట్ క్రికెట్లో 23వ అర్థశతకం పూర్తిచేశాడు. 105 బాల్స్ లో 10 బౌండ్రీలతో కొహ్లీ 63, రహానే 70బాల్స్ లో 3 బౌండ్రీలతో 18 పరుగుల నాటౌట్ స్కోర్లు సాధించడంతో భారత్ 3 వికెట్లకు 273 పరుగుల స్కోరు నమోదు చేసింది.
సౌతాఫ్రికా బౌలర్లలో…ఫాస్ట్ బౌలర్ రబాడా 48 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టాడు.

రెండో రోజు ఆటలో భారత్ ఓవర్ నైట్ స్కోరుకు మరో 250 పరుగుల స్కోరు జత చేయగలిగితే సౌతాఫ్రికాకు మరో పరాజయం తప్పదు.