పోలవరం అక్రమాలపై చర్యలు తీసుకోండి – ఢిల్లీ హైకోర్టు

పోలవరంలో అవినీతి, అక్రమాలు జరిగాయంటూ సామాజిక కార్యకర్త పెంటపాటి పుల్లారావు దాఖలు చేసిన పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు స్పందించింది. పోలవరం అవినీతిపై వస్తున్న ఫిర్యాదులపై విచారణ జరిపి, చర్యలు తీసుకోవాలని కేంద్ర జలశక్తి శాఖకు ఆదేశించింది.

గత ప్రభుత్వం ప్రాజెక్టు అంచనా వ్యయాన్ని భారీగా పెంచిందని, 16వేల కోట్ల నుంచి 58వేల కోట్లకు పెంచేశారని, ఎలాంటి టెండర్లు లేకుండానే నామినేషన్ పద్దతిలో పనులు కేటాయించారని పిటిషన్‌లో పుల్లారావు వివరించారు. ఆర్‌ అండ్ ఆర్‌లో భారీగా అక్రమాలు జరిగాయని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. కాగ్ కూడా ఈ అక్రమాలను ఎత్తిచూపిందని వివరించారు. అక్రమాలపై ఫిర్యాదు చేసినా కేంద్రం పట్టించుకోవడం లేదన్నారు.

ఫిర్యాదులను ఎందుకు పట్టించుకోవడం లేదని కేంద్ర ప్రభుత్వం, పోలవరం అథారిటి తరపున న్యాయవాదిని కోర్టు ప్రశ్నించింది.

అయితే పోలవరం అథారిటి తరపు న్యాయవాది ఈ కేసు ఏపీకి సంబంధించింది కాబట్టి ఢిల్లీ హైకోర్టు పరిధిలోకి రాదు అని వాదించారు. ఆ వాదనతో ఏకీభవించని కోర్టు… అక్రమాలపై పిటిషనర్‌ ఇచ్చిన వివరాలను పరిగణనలోకి తీసుకుని విచారణ జరిపించాలని ఆదేశించింది.

చంద్రబాబు హయాంలో పోలవరం ప్రాజెక్టులో భారీగా అవినీతి జరిగిందంటూ ఇది వరకే పుల్లారావు కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు.

ఆ లేఖపై స్పందించిన కేంద్రం… లేఖలో చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నారా అంటూ ప్రతిలేఖ రాసింది. తాను ఆరోపణలు నిరూపించేందుకు సిద్ధంగా ఉన్నానని… చేసిన ఆరోపణలకు కట్టుబడి ఉన్నానని పుల్లారావు స్పష్టం చేశారు.

కానీ ఆ తర్వాత కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. దాంతో ఆయన ఢిల్లీ హైకోర్టు తలుపు తట్టారు.