మేం బావబామ్మర్దులం – సుబ్బారెడ్డి ఇంట్లో పంచాయతీ

నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్దన్‌ రెడ్డి మధ్య ఏర్పడిన వివాదం పరిష్కారం అయింది. గోవర్దన్‌ రెడ్డి ఆదేశాలతో కోటంరెడ్డి అనుచరుడికి సంబంధించిన వెంచర్‌కు వెంకటాచలం ఎంపీడీవో నీటి పైపు అనుమతి ఇవ్వకపోవడంతో వివాదం మొదలైంది.

కోటంరెడ్డి తన ఇంటిపై దాడి చేశారంటూ ఎంపీడీవో ఏకంగా స్టేషన్‌లో ఫిర్యాదు చేయడం, ఆ కేసులో పోలీసులు కోటంరెడ్డిని అరెస్ట్ చేయడం జరిగాయి.

ఎంపీడీవో వెనుక కాకాణి ఉన్నారని… ఆయన సలహాతోనే ఆమె తనపై కేసు పెట్టారని కోటంరెడ్డి ఆరోపించడంతో వైసీపీ ఎమ్మెల్యేల మధ్య విభేదాలు బహిర్గతమయ్యాయి. పార్టీ పరువు బజారునపడడంతో సీఎం సీరియస్‌ అయ్యారు. అమరావతికి పిలిపించారు. వీరి వ్యవహారంపై చర్చించాల్సిందిగా వైవీ సుబ్బారెడ్డికి సీఎం సూచించారు. దాంతో ఇద్దరు ఎమ్మెల్యేలను తన ఇంటికి పిలిపించుకుని వైవీ సుబ్బారెడ్డి మాట్లాడారు.

జిల్లాలో పార్టీ బలంగా ఉన్న వేళ ఇలా రోడ్డున పడడం సరికాదని వారికి సూచించారు. ఇద్దరి మధ్య ఎక్కడ వివాదం వచ్చిందన్న దానిపై ఆరా తీశారు. తనపై కేసు పెట్టేందుకు ఎంపీడీవోను స్వయంగా వెంకటాచలం వైసీపీ నాయకుడే ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారని కోటంరెడ్డి గుర్తు చేశారు. ఇలా చేయడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు.

ఇందుకు స్పందించిన కాకాణి గోవర్దన్‌ రెడ్డి… ఎంపీడీవో సరళ ప్రభుత్వానికి బాగా సహకరిస్తున్నారని అలాంటి ఆమెకు ఇబ్బంది రావడంతో తాము మద్దతుగా నిలిచామని వివరించారు. అంతకు మించి ఈ విషయంతో తన ప్రమేయం లేదన్నారు.

భేటీ అనంతరం ఇద్దరు నేతలు మీడియాతో మాట్లాడారు. కాకాణితో ఎలాంటి వివాదం లేదని కోటంరెడ్డి చెప్పారు. కాకాణి స్వయానా తన మేనత్త కుమారుడని… కొందరు తమను విడదీయాలని చూస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు.

ఇలాంటి వారిలో వెంకటాచలం వైసీపీ నేత ప్రతాప్ రెడ్డి కూడా ఉన్నారని ఆరోపించారు. ఎంపీడీవో తనపై పెట్టిన కేసు అవాస్తవాలతో కూడుకున్నదని కోటంరెడ్డి చెప్పారు.

తమ మధ్య ఎలాంటి వివాదం లేదని…. చిన్నచిన్న సమస్యలు సర్దుబాటు చేసుకుంటామని కాకాణి చెప్పారు. కోటంరెడ్డి తన బావమరిది అని… చిన్నప్పటి నుంచి తాము మంచి స్నేహితులమని… పార్టీ కోసం కలిసి పనిచేస్తామన్నారు. తమ మధ్య సమస్యలు సృష్టించేందుకు కొందరు ప్రయత్నిస్తున్నారని కాకాణి ఆరోపించారు.