మరోసారి మోడీతో జగన్… 

వైసీపీ అధినేత, ఏపీ సీఎం జగన్ మరోసారి శుక్రవారం ఢిల్లీ వెళుతుండడం రాజకీయంగా హీట్ పెంచింది. వారం వ్యవధిలోనే రెండోసారి జగన్ ఢిల్లీ బాట పట్టడం…. రెండు రోజుల పాటు ఢిల్లీలో ఉండనుండడం.. ప్రధాని అపాయింట్ మెంట్ ను బట్టి శుక్రవారం సాయంత్రం లేదా శనివారం ఉదయం ప్రధాని నరేంద్రమోడీని కలువనుండడం రాజకీయంగా హాట్ టాపిక్ గా మారింది.

ఇప్పటికే జగన్ అక్టోబర్ 5న ఢిల్లీ వెళ్లి దాదాపు గంటన్నర పాటు ప్రధాని నరేంద్రమోడీతో వివిధ అంశాలపై చర్చించారు. దాదాపు 80వేల కోట్లు… వివిధ పథకాలు, ప్రాజెక్టులకు సాయం చేయాలని కోరారు.

తాజాగా వారంలోనే రెండోసారి సీఎం జగన్ ప్రధాని నరేంద్రమోడీతో భేటీ అవుతున్నారు. వైఎస్ఆర్ రైతు భరోసా పథకాన్ని ప్రారంభించడానికి మోడీని నెల్లూరుకు రావాలని కోరుతారని అధికార వర్గాలు చెబుతున్నాయి.

ఇక రాష్ట్రంలో ఆర్థిక సంక్షోభం దృష్ట్యా తక్షణ ఆర్థికసాయం కోసం ఆయన ప్రధానిని అభ్యర్థించబోతున్నారని సమాచారం.

తాజా భేటీలో జగన్ కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను కూడా కలువనున్నారు.

ఇక కేంద్ర జలవనరుల శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షేకావత్ ను కలిసి పోలవరం సమస్యపై స్పష్టతను ఇవ్వవచ్చని తెలుస్తోంది.

అయితే అధికారంగా ఈ సమావేశం సమస్యలపై అని అంటున్నా.. అంతకుమించిన రాజకీయం మోడీ-జగన్ భేటీలో ఉందని టీడీపీ వర్గాలు అనుమానిస్తున్నాయి.. ఖచ్చితంగా ఏదో జరుగుతుందన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు.