చెరో అర్థరూపాయి అంటూ బ్రోకరిజం చేసింది చంద్రబాబే

మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు దిగజారిపోయి, ఫ్రస్టేషన్‌లో ఏదేదో మాట్లాడుతున్నారని వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు విమర్శించారు. బ్రోకరిజం చేయడం, పంచాయతీలు చేయడం చంద్రబాబుకే అలవాటన్నారు.

నియోజకవర్గంలో వచ్చే ఆదాయం నుంచి చెరో అర్ధరూపాయి పంచుకోండి అని ఆదినారాయణరెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య పంచాయతీ చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు. విశాఖ భూకుంభకోణంలో గంటాకు, అయ్యన్నపాత్రుడి మధ్య పంచాయతీ చేసింది చంద్రబాబు కాదా అని నిలదీశారు.

ఎమ్మార్వో వనజాక్షికి, చింతమనేనికి మధ్య… రవాణా కమిషన్‌ బాలసుబ్రమణ్యంకు, బోండా ఉమాకు మధ్య పంచాయతీ చేసింది చంద్రబాబు కాదా అని ప్రశ్నించారు.

పంచాయతీలు చేయడం, బ్రోకరిజం చేయడం చంద్రబాబుకు అలవాటు అని … చంద్రబాబు రాజకీయంగా ఎదిగిందే బ్రోకరిజం ద్వారా అని అంబటి రాంబాబు ఫైర్ అయ్యారు.

ఇద్దరు ముఖ్యమంత్రులను అందించిన పులివెందులను అవమానించేలా.. పదేపదే పులివెందుల పంచాయతీ అంటూ చంద్రబాబు రాయలసీమ ప్రజలను కించపరుస్తున్నారని అంబటి విమర్శించారు. మరోసారి పులివెందుల అని విమర్శిస్తే చంద్రబాబుకు కర్రు కాల్చి వాతాలు పెట్టాలని పులివెందుల ప్రజలకు సూచించారు.

కరకట్ట ఇంటిని ల్యాండ్ పూలింగ్‌లో తీసుకున్నామని చెప్పింది చంద్రబాబు కాదా అని నిలదీశారు. కానీ అధికారం పోగానే ఇప్పుడు అద్దెకు ఉన్నాను అని చెప్పడానికి చంద్రబాబుకు సిగ్గుందా అని అంబటి మండిపడ్డారు.

సొంత పార్టీ ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ఎంపీడీవో ఫిర్యాదు చేయగానే అరెస్ట్ చేయాల్సిందిగా జగన్ మోహన్ రెడ్డి ఆదేశించారని… అదే ఎమ్మార్వో వనజాక్షి విషయంలో చింతమనేనిని వెనుకేసుకొచ్చేందుకు చంద్రబాబు ఎలా ప్రవర్తించారో ప్రజలు పోల్చి చూసుకోవాలన్నారు. కోటంరెడ్డికి బెయిల్‌ వస్తే చంద్రబాబు విమర్శిస్తున్నారని… కోడెల శివరాంకు అనేక కేసుల్లో వెంటనే బెయిల్‌ వచ్చిందని… అది సహజంగా జరిగేదన్నారు.

జగన్‌మోహన్ రెడ్డి ఏ పథకం పెడుతున్నా అది ఇది వరకే తాను పెట్టానని చంద్రబాబు దిగజారి ప్రచారం చేసుకుంటున్నారని అంబటి ఎద్దేవా చేశారు. 43వేల బెల్ట్‌ షాపులను రద్దు చేసిన ఘనత తమ ప్రభుత్వానిదేనన్నారు. చంద్రబాబు పిచ్చివాగుడుకి, అసత్య ఆరోపణలకు జగన్‌మోహన్ రెడ్డి స్పందించాల్సిన అవసరం లేదన్నారు. చంద్రబాబు స్థాయిని కోల్పోయారన్నారు.