అటు నితిన్, ఇటు ప్రభాస్… సురేందర్ రెడ్డి దారేది?

దర్శకుడు సురేందర్ రెడ్డిపై హీరో నితిన్ ఇప్పటికే కర్చీఫ్ వేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నితిన్ తండ్రి సుధాకర్ రెడ్డి, సురేందర్ రెడ్డితో టచ్ లోకి వెళ్లారు. అడ్వాన్స్ కూడా ఇచ్చినట్టు వార్తలు వచ్చాయి. కానీ సురేందర్ రెడ్డి ఆలోచనలు మాత్రం వేరేలా ఉన్నాయి. నితిన్ తో కాకుండా, కుదిరితే ప్రభాస్ తో ఓ మూవీ చేయాలనే ఆలోచనలో ఉన్నాడట సురేందర్ రెడ్డి. దీనికి ఓ కారణం కూడా ఉంది.

సైరా లాంటి ప్రతిష్టాత్మక చిత్రం తర్వాత, చేస్తే అలాంటిదే మరో భారీ సినిమా చేయాలనేది సురేందర్ రెడ్డి ఆలోచన. ఆ ప్లాన్ కు తగ్గట్టే ఓ స్టోరీలైన్ అనుకున్నాడు కూడా. అయితే కథకు నితిన్ సరిపోడు. అతడి మార్కెట్ కూడా సరిపోదు.

అందుకే ప్రభాస్ తో ఆ సినిమా చేయాలనేది సూరి ప్లాన్. బాహుబలితో పాన్-ఇండియా స్టార్ అనిపించుకున్న ప్రభాస్, సాహోతో మరోసారి బాలీవుడ్ లో తన సత్తా చాటిన విషయం తెలిసిందే. పైగా చిరంజీవితో పాటు రవితేజ, రామ్ చరణ్, అల్లు అర్జున్, ఎన్టీఆర్ లాంటి స్టార్స్ తో సినిమాలు చేసిన సురేందర్ రెడ్డి, ప్రభాస్ తో మూవీ చేస్తే కెరీర్ లైనప్ బాగుంటుందని కూడా భావిస్తున్నాడు.

కానీ అటు ప్రభాస్ మాత్రం చాలా బిజీగా ఉన్నాడు. రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కంప్లీట్ అయిన తర్వాత పెళ్లి చేసుకొని కాస్త గ్యాప్ తీసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. అయితే సురేందర్, వీటన్నింటికీ సిద్ధపడే ఉన్నాడు. ప్రభాస్ ఓకే అంటే కనుక మరో ఏడాది పాటు వెయిట్ చేయడానికి తనకు ఏమాత్రం అభ్యంతరం లేదన్నట్టుగా సంకేతాలు పంపుతున్నాడు. సురేందర్ రెడ్డి జోరు చూస్తుంటే.. నితిన్ కు నిరాశ తప్పేలా లేదు.