నగదు విత్‌డ్రాపై బ్యాంకు ఆంక్షలు… తీవ్ర ఇబ్బందుల్లో నటి

పంజాబ్- మహారాష్ట్ర కార్పొరేషన్ బ్యాంకు కుంభకోణం అనేక మంది జీవితాలను వణికిస్తోంది. కుంభకోణం నేపథ్యంలో ఖాతాదారుల నగదు విత్‌డ్రాపై ఆంక్షలు విధించారు.

తొలుత కేవలం వెయ్యిరూపాయలు మాత్రమే విత్ డ్రా చేసేలా ఆంక్షలు విధించారు. ఖాతాదారుల నుంచి తీవ్ర ప్రతిఘటన రావడంతో దాన్ని రూ. 25 వేలకు పెంచారు. కానీ హఠాత్తుగా విత్‌డ్రాపై ఆంక్షలు విధించడంతో అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయి.

వివాహాలు, ఇతర కార్యక్రమాలు పెట్టుకున్న వారు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. కడుపు మండిన ఖాతాదారులు ఏకంగా ముంబైలోని బీజేపీ కార్యాలయాన్ని ముట్టడించారు. కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

ఇలా పీఎంసీ బ్యాంకులో ఖాతాదారుగా ఉన్న వారిలో ప్రముఖ టీవీ నటి నూపుర్ అలంకార్‌ ఒకరు. నగదు విత్‌డ్రాపై ఆంక్షల వల్ల తాను అనేక ఇబ్బందులు పడుతున్నానని ఆమె వాపోయారు. ఆమె తల్లి ఆస్పత్రిలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. ఇటీవలే ఆమె మామకు ఆపరేషన్ అయింది. అందుకు సంబంధించిన ఆస్పత్రి బిల్లు చెల్లించేందుకు కూడా తన వద్ద డబ్బులు లేకుండాపోయాయని వాపోయింది. చివరకు తన నగలను అమ్మి డబ్బు తీసుకురావాల్సి వచ్చిందని వివరించారు.

తన డబ్బంతా పీఎంసీలోనే ఉందని… వెంటనే పరిస్థితిని చక్కదిద్దకపోతే తాను ఇంట్లోని ఇతర వస్తువులను కూడా అమ్ముకోవాల్సి ఉంటుందని ఆవేదన చెందారామె.

పీఎంసీ వ్యవహారంపై స్పందించిన కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఈ విషయంలో తానేమీ చేయలేనని తేల్చేశారు. ఈ వ్యవహారం ఆర్‌బీఐ పరిధిలోనిది అని వ్యాఖ్యానించారు.

ఖాతాదారుల ఆందోళనను అర్థం చేసుకున్నామని… వారికి న్యాయం చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆర్‌బీఐను కోరుతామన్నారు.