ప్రొఫెసర్‌పై సీఎం జగన్‌కు విద్యార్ధినుల ఫిర్యాదు

రాజమండ్రి ఆదికవి నన్నయ యూనివర్శిటీలో లైంగిక వేధింపుల అంశం కలకలం రేపుతోంది. వర్శిటీలో ఇంగ్లీష్‌ ప్రొఫెసర్‌గా, హెడ్‌ ఆఫ్‌ ద డిపార్ట్‌మెంట్‌గా ఉన్న సూర్య రాఘవేంద్రపై విద్యార్థినులు నేరుగా సీఎం జగన్‌ మోహన్ రెడ్డికి లేఖ రాశారు.

ప్రొఫెసర్ తమను లైంగికంగా వేధిస్తున్నారని, చర్యలు తీసుకోవాలని కోరుతూ లేఖ రాశారు. ఈ లేఖకు స్పందించిన ప్రభుత్వం…. ఉన్నత విద్యా శాఖ ద్వారా దర్యాప్తుకు ఆదేశించింది. దీంతో అధికారులు విచారణ జరుపుతున్నారు.

సూర్య రాఘవేంద్ర

స్పెషల్ క్లాస్‌ల పేరుతో తమను ఇంటికి పిలిపించుకుని అక్కడికి వెళ్లిన తర్వాత లైంగికంగా వేధిస్తున్నారని విద్యార్థినులు ఆరోపిస్తున్నారు. మార్కులు, ప్రాజెక్ట్ వర్క్ పేరుతో బ్లాక్‌మెయిల్ చేస్తూ లొంగదీసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడని ఆరోపించారు.

సూర్య రాఘవేంద్ర మాత్రం ఈ ఆరోపణలను ఖండిస్తున్నాడు. స్పెషల్ క్లాస్‌లకు రావడం ఇష్టం లేని వారు, వాటిని నిర్వహించకుండా అడ్డుకునేందుకు ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని చెబుతున్నాడు.