చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి అనొద్దు.. ముఖ్యమంత్రి అనాలంటూ కార్యకర్తలకు పిలుపు

ఆయన 40 ఇయర్స్ ఇండస్ట్రీ.. రాజకీయాల్లో ఆరితేరిన నేత.. అలాంటి టీడీపీ అధినేత చంద్రబాబునే ఆడేసుకుంటున్నారట టీడీపీ సీనియర్లు.

తాజాగా విశాఖ జిల్లాలో జరుగుతున్న టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో బాబుకు ఒకటే భజన చేస్తున్నారట.. దీనికి చంద్రబాబు హ్యాపీగా ఫీల్ అవుతుండగా.. కొందరు నేతలు మాత్రం బాబుకు బాగానే బిస్కెట్లు వేస్తున్నారని చెవులు కొరుక్కుంటున్నారట.

ఈ అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోవడంతో నీరుగారిపోయిన టీడీపీ శ్రేణుల్లో ఉత్సాహం నింపేందుకు చంద్రబాబు నడుం బిగించారు. ఇందులో భాగంగానే మొన్ననే తూర్పు గోదావరి జిల్లాలో పర్యటించిన బాబు.. తాజాగా విశాఖలో రెండు రోజుల పర్యటన పెట్టుకున్నారు.

అయితే టీడీపీని వీడి బీజేపీలో చేరుదామని ప్రయత్నించిన గంటా సహా అసమ్మతి, అసంతృప్త నేతలంతా ఈ భేటీకి హాజరుకావడం విశేషం.

టీడీపీ ఓడిపోయినప్పుడు చంద్రబాబు తీరును తప్పుపట్టిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు కూడా ఈ భేటికి హాజరై చంద్రబాబును ఆకాశానికి ఎత్తేయడం అక్కడున్న వారు ముక్కున వేలేసుకునేలా చేసింది.

అయ్యన్న పాత్రుడు చంద్రబాబును బుట్టలో వేసుకునేలా ప్రసంగించిన తీరు అందరిలోనూ ఆసక్తి రేపింది.. చంద్రబాబును మాజీ ముఖ్యమంత్రి అనొద్దని.. ముఖ్యమంత్రి అనాలంటూ కార్యకర్తలకు అయ్యన్నపాత్రుడు పిలుపునిచ్చారు.

చంద్రబాబును ఓడించినందుకు తప్పు చేశామని రాష్ట్ర ప్రజలు చెంపలు వేసుకుంటున్నారని మాజీ మంత్రి తెలిపారు.

చంద్రబాబుకు అన్యాయం జరిగిందని ఆడవాళ్లు సైతం ఆవేదన చెందుతున్నారని… అయ్యన్న వేదికపై ఎమోషనల్ పంచ్ డైలాగులు పేల్చారు. దీనికి చంద్రబాబు నిజమేననుకొని ఎమోషనల్ అయ్యారని తెలుస్తోంది.

ఇలా బాబుకు భజన చేస్తూ అసలు సంగతులను, పార్టీ పరిస్థితిని నేతలు వివరించకపోవడమే…. టీడీపీ ఓటమికి కారణమైందన్న చర్చ ఆ పార్టీ నేతల్లో సాగిందట.