నేడే భారత క్రికెటర్ల సంఘం ఎన్నికలు

  • ఇటు అంశుమన్ గయక్వాడ్…అటు కీర్తి అజాద్
  • 1267 మంది క్రికెటర్లకు ఓటు హక్కు

భారత క్రికెట్ బోర్డు చరిత్రలోనే ఓ అసాధారణ ఎన్నికకు కౌంట్ డౌన్ ప్రారంభమయ్యింది. సుప్రీంకోర్టు నియమించిన జస్టిస్ లోథా కమిటీ ఆదేశాల మేరకు.. సరికొత్త రాజ్యాంగంతో ఈ నెల 23న జరుగనున్న బీసీసీఐ కార్యవర్గ ఎన్నికలకు ముందే… భారత క్రికెటర్ల సంఘానికి సైతం ఎన్నికలు నిర్వహించడానికి రంగం సిద్ధమయ్యింది.

 

మొత్తం 1267 మంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లు శుక్రవారం జరిగే ఓటింగ్ లో తమ ఓటుహక్కును తొలిసారిగా వినియోగించుకోబోతున్నారు.

పోటీ లేకుండా ఎన్నికైన శాంతా రంగస్వామి…

మొత్తం తొమ్మిదిమంది సభ్యుల బీసీసీఐ అపెక్స్ కౌన్సిల్ లో రెండుస్థానాలకు..క్రికెటర్ల సంఘంలో ఎన్నికలు నిర్వహిస్తున్నారు.

మహిళా ప్రతినిథిగా.. మాజీ కెప్టెన్ శాంతా రంగస్వామి…పోటీలేకుండానే ఎన్నిక కాగా..పురుషుల ప్రతినిధి స్థానం కోసం…మాజీ క్రికెటర్లు అంశుమన్ గయక్వాడ్, కీర్తి అజాద్ పోటీలో నిలిచారు.

అంశుమన్ గయక్వాడ్ తో కీర్తి అజాద్ ఢీ…

వెస్ట్ జోన్ కమ్ ముంబై క్రికెట్ ప్రాబల్యం చాటుకోడానికి అంశుమన్ గయక్వాడ్ పోటీలో నిలిస్తే..నార్త్ జోన్ కమ్ ఢిల్లీ క్రికెట్ ఉనికిని చాటడానికి కీర్తి అజాద్ బరిలోకి దిగారు.

దేశంలోని వివిధ క్రికెట్ సంఘాలకు చెందిన మొత్తం 1267 మంది క్రికెటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.

భారత మాజీ కెప్టెన్లు రవిశాస్త్రి, రాహుల్ ద్రావిడ్, కపిల్ దేవ్, మాస్టర్ సచిన్, మహ్మద్ అజరుద్దీన్ తో సహా వందలాదిమంది ప్రస్తుత, మాజీ క్రికెటర్లు ఓిటింగ్ లో పాల్గోనున్నారు.

1976, 2001 సంవత్సరాలలో భారత క్రికెటర్ల సంఘాన్ని ఏర్పాటు చేయటానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

అయితే…సుప్రీంకోర్టు ప్రమేయంతో ఏర్పడిన జస్టిస్ లోథా కమిషన్ సిఫారసుల పుణ్యమా అంటూ…భారత క్రికెటర్ల సంఘానికి తొలిసారిగా ఎన్నిక నిర్వహిస్తున్నారు.

ఐసీఏ అధ్యక్షుడిగా అశోక్ మల్హోత్రా, ఐపీఎల్ మండలి సభ్యుడిగా సురేందర్ ఖన్నా పోటీలేకుండానే ఎన్నిక కావడం ఖాయమయ్యింది.

భారత క్రికెట్ బోర్డు నిర్వహణలో రాజకీయ వేత్తలు, వ్యాపారవేత్తల ఆధిపత్యాన్ని నిర్మూలించి…క్రికెటర్ల పాత్ర పెంచడానికి వీలుగా జస్టిస్ లోథా కమిటీ ఈ నిబంధనను విధిగా అమలు చేయాలని ఆదేశించింది.