నేను గట్టిగా మాట్లాడితే వైఎస్ భయపడేవారు…. ఇప్పుడా పరిస్థితి లేదు

గతంలో తాను గట్టిగా అసెంబ్లీలో మాట్లాడితే వైఎస్ భయపడేవారని… ఆ భయంతోనే తాను తెచ్చిన పథకాలను కూడా వైఎస్‌ అధికారంలో ఉన్నప్పుడు కొనసాగించారని చంద్రబాబు చెప్పుకున్నారు. కానీ ఇప్పుడా పరిస్థితి లేకుండా పోయిందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం దురుద్దేశంతోనే గత ప్రభుత్వ పథకాలను, బిల్లులను అడ్డుకుంటోందని చంద్రబాబు ఆరోపించారు.

విశాఖలో జరిగిన పార్టీ సర్వసభ్య సమావేశంలో మాట్లాడిన చంద్రబాబు… టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు తాము తలుచుకుని ఉంటే జగన్మోహన్‌ రెడ్డి వీధుల్లోకి వచ్చి ఉండేవారా అని ప్రశ్నించారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు తిరగబడితే జగన్‌ పులివెందుల పారిపోవాల్సి ఉంటుందన్నారు.

ఎన్నికలు 2022లోగానీ, 2023 మొదట్లో గానీ జమిలిగా వచ్చే అవకాశం ఉందని… అందుకు కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని చంద్రబాబు పిలుపునిచ్చారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా ఎగిరేది టీడీపీ జెండానే అని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. ఆ దిశగా పార్టీని అన్ని విభాగాల్లోనూ బలోపేతం చేస్తామని చంద్రబాబు చెప్పారు. నవంబర్‌లో పార్టీలో ఎన్నికలు నిర్వహిస్తామని, సమర్ధులకే పదవులిస్తామన్నారు.

పోలీసులకు కూడా చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కొందరు పోలీసు అధికారులు అతి చేస్తున్నారని…. వారి సంగతి తేలుస్తానని చంద్రబాబు ఫైర్ అయ్యారు. పోలీసుల ఇలాగే వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇబ్బందులు, బాధలు పడాల్సి వస్తుందని ఆ విషయం గుర్తు పెట్టుకుని పనిచేయాలని హెచ్చరించారు.

డీజీపీ తీరు పూర్తి అప్రజాస్వామికంగా ఉందన్నారు. 14 ఏళ్లుగా సీఎంగా పనిచేశానని.. అందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని, తమాషాలు చేస్తే ఊరుకునేది లేదని పోలీసు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు చంద్రబాబు.