చంద్రబాబుకు అంత ధీరత్వమే ఉంటే…

చంద్రబాబు గాండ్రిస్తే వైఎస్ భయపడేవారా?. ఇప్పుడిదే టాక్‌ ఆఫ్‌ ది సోషల్ మీడియా. గతంలో వైఎస్ సీఎంగా ఉన్నప్పటికీ అసెంబ్లీలో తాను లేచి మాట్లాడితే వైఎస్ భయపడిపోయేవారని.. ఆ భయంతోనే టీడీపీ తెచ్చిన పథకాలను వైఎస్ కొనసాగించారని చంద్రబాబు విశాఖలో సెలవిచ్చారు.

చంద్రబాబు సీరియస్‌గా చెప్పిన ఈ డైలాగ్‌కు చాలా మంది వైఎస్‌ అసెంబ్లీలో నవ్విన తరహాలోనే నవ్వుకుంటున్నారు. అయినా చంద్రబాబు ఇలా చెప్పడంలో ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఇందిరాగాంధీతోనే పోరాటం చేసిన బ్లడ్‌ ఆయనది. బ్రిటీష్‌ వారి మీదకే తెలుగుదేశం పార్టీ శ్రేణులను ఉరకలెత్తించిన నాయకత్వం ఆయనది. అలాంటప్పుడు ఆయన్ను చూసి వైఎస్‌ భయపడి ఉంటారన్న డైలాగ్‌ చూసి మరీ మూర్చపోవాల్సిన అవసరం లేదు.

కాకపోతే తాను తెచ్చిన పథకాలను… వైఎస్‌ భయంతో కొనసాగించారన్నదే కాస్త విచిత్రంగా అనిపిస్తుంది. వైఎస్‌ సీఎం అవగానే చేసిన పనుల్లో చంద్రబాబు జన్మభూమి కార్యక్రమం, నీరు-మీరు పథకం రద్దు చేయడం. కాబట్టి బాబు పేరున ఉన్న ఆ రెండు పథకాలను వైఎస్‌ మోహమాటం లేకుండా రద్దు చేశారు. జనానికి కూడా ఆ రెండు కార్యక్రమాలతో నేరుగా సంబంధం లేదు కాబట్టి రద్దు చేసినా ఏమీ బాధపడలేదు.

వైఎస్‌ సీఎంగా ఉన్నప్పుడు… ఆయన బాబును చూసి భయపడలేదు కానీ.. కాంగ్రెస్ హైకమాండ్‌లోని తన చీకటి దోస్తుల సాయంతో చంద్రబాబే సేఫ్‌గా ఉంటూ వచ్చారు. కాకపోతే ఇప్పుడు జగన్‌ను అలా నియంత్రించేందుకు వైసీపీ నెత్తిన ఢిల్లీ హైకమాండ్ లేదాయే. ఇదే బాబుకు పెద్ద సమస్య.

అందుకే వైఎస్‌ తనను చూసి భయపడ్డారన్న భ్రమతోనే … అదే తరహా భ్రమ జగన్ విషయంలో నిజం కాలేదే అని బాబు బాధ. అయినా బాబుకు అంత ధైర్యమే ఉంటే… ఎన్నికల ముందు మోడీపై తొడకొట్టి… ఎన్నికల తర్వాత నాలుగు నెలల్లో కనీసం ఒకసారి కూడా మోడీ పేరు ఎందుకెత్తలేదబ్బా!.

తెల్లదొరలను హడలెత్తించిన నారావారు… ఎన్నికలైపోయిన వెంటనే తన కుడి, ఎడమ భుజాలైన ఎంపీలను బీజేపీ వద్ద తాకట్టు ఎందుకు పెట్టారబ్బా?. చూస్తుంటే ఆదేదో సినిమాలో బ్రహ్మానందం చెప్పినట్టు ఇది ఫోర్త్ స్టేజ్‌లాగే ఉంది.