బడాబాబులకు రూ. 1.76 లక్షల కోట్ల రుణమాఫీ

దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ వికృతపోకడలు కొనసాగుతూనే ఉన్నాయి. సామాన్యుడికి లక్ష రూపాయలు రుణాలు ఇచ్చేందుకు సవాలక్ష కండిషన్లు పెట్టి.. దాన్ని వసూలు చేసేందుకు నానా ఇబ్బందులుపెట్టే బ్యాంకులు బడాబాబులకు మాత్రం సలాం కొడుతున్నాయి. దాంతో బ్యాంకింగ్ వ్యవస్థ కుదేలవుతోంది. తిరిగి ఆ లోటును భర్తీ చేసేందుకు సామాన్యుల కష్టార్జీతాన్ని దోపిడి చేస్తున్నారు.

తాజాగా ఒక ఆంగ్ల మీడియా సంస్థ సమాచార హక్కు చట్టం కింద బయటకు తీసిన అంశాలు దిగ్బ్రాంతి కలిగిస్తున్నాయి. గత మూడేళ్లలో బ్యాంకులు దేశంలో ఏకంగా లక్షా 76వేల కోట్ల రూపాయల బడాబాబుల రుణాలు రద్దు చేశాయి. ఇలా రద్దయిన రుణాల్లో 100 కోట్ల కంటే ఎక్కువ మొత్తం రుణాలు తీసుకుని ఎగ్గొట్టిన వారే ఎక్కువ మంది ఉన్నారు.100 కోట్లు అంత కంటే ఎక్కువ రుణం తీసుకుని మొండికేసిన 416 మంది బడాబాబుల రుణాలను మొండిబకాయిల కింద బ్యాంకులు రద్దు చేశాయి.

సగటున ఒక్కొక్కరూ ఎగవేసిన మొత్తం రూ. 424 కోట్లుగా ఉంది. మోడీ సర్కార్‌ వచ్చిన తర్వాతనే ఇలా బడాబాబుల రుణాలను మొండి బకాయిలుగా చూపించి రద్దు చేయడం అమాంతం పెరిగింది.  పెద్ద నోట్ల రద్దు తర్వాత మొండిబకాయిల కొట్టివేత పెరిగింది.

ప్రభుత్వ బ్యాంకులకు రూ. 500 కోట్లకు పైగా ఎగవేసిన వారి సంఖ్య 88గా ఉంది. ఈ 88 మంది ఎగొట్టిన మొత్తమే లక్షా ఏడు వేల కోట్లుగా ఉంది. ఒక్క ఎస్‌బీఐకి ఎగ్గొట్టిన మొత్తమే 76వేల కోట్లుగా ఉంది.