చిరంజీవిపై పోస్టులతో నాకు సంబంధం లేదు

ఈనెల 14న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌ మోహన్ రెడ్డితో మెగాస్టార్ చిరంజీవి, ఆయన కుమారుడు రామచరణ్‌ భేటీ జరగాల్సి ఉన్న నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌ రెడ్డి పేరుతో ప్రచారంలోకి వచ్చిన ఒక ఫేస్‌బుక్ పోస్టు చర్చకు దారి తీసింది.

జగన్, చిరంజీవి భేటీ నేపథ్యంలో చెవిరెడ్డి మెగా కుటుంబాన్ని విమర్శిస్తూ సోషల్ మీడియాలో ఒక పోస్టు ప్రత్యక్షమయింది. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పేరుతో ఉన్న ఒక నకిలీ అకౌంట్‌లో కొందరు వ్యక్తులు ఒక పోస్టు పెట్టారు.

‘ఓడలు బండ్లు అవుతాయి. బండ్లు ఓడలు అవుతాయి. చిరంజీవి కేంద్రమంత్రి గా ఉన్నప్పుడు జగన్ అరెస్టు అయ్యాడు.

”చట్టం ఇప్పుడు తన పని తాను చేసింది” అని వెంటనే కామెంట్ చేశాడు రామ్ చరణ్ సంతోషం పట్టలేక.

వైఎస్ కుటుంబం అంటే మెగా కుటుంబానికి అంత కసి.

అలాంటి తండ్రి కొడుకులు అదే జగన్ దర్శనం కోసం పడిగాపులు పడి అనుమతి సంపాదించారు. తమ సినిమాను ప్రత్యేకంగా చూడాల్సిందిగా ప్రార్ధించబోతున్నారు.

అదే కాల మహిమ అంటే.. థటిజ్ వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గారు.. టీమ్ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు’ అంటూ పోస్ట్‌ను పెట్టారు.

దీనిపై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మెగా కుటుంబాన్ని చెవిరెడ్డి అవమానించారంటూ కొందరు పోస్టులు పెట్టారు. దీనిపై చెవిరెడ్డి స్పందించారు. తాను చిరంజీవిపై ఎలాంటి పోస్టులు పెట్టలేదని చెప్పారు. తన అభిమాన సంఘం పేరుతో తప్పుడు ప్రచారాన్ని ఖండిస్తున్నట్టు చెప్పారు. తనకు అసలు ఫేస్‌బుక్, ట్విట్టర్ అకౌంట్లే లేవన్నారు.

చిరంజీవిపై తాను పోస్టులు పెట్టలేదని…. ఆ ప్రచారం పూర్తిగా అవాస్తవమన్నారు. చిరంజీవితో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. కావాలనే తనపై బురద జల్లేందుకు కొందరు కుట్రపూరితంగా ఈ పనిచేసి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. దీని వెనుక టీడీపీ హస్తముందని చెవిరెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.