విశాల్ పెళ్లి పై క్లారిటీ

నిశ్చితార్థం చేసుకొని చాలా రోజులైంది. ఇప్పటివరకు పెళ్లి చేసుకోలేదు. పైపెచ్చు తాజాగా నిశ్చితార్థం అయిన అమ్మాయి ఫొటోల్ని సోషల్ మీడియా నుంచి తొలిగించాడు. దీంతో విశాల్ పెళ్లిపై చాలా ఊహాగానాలు చెలరేగాయి. విశాల్ పెళ్లి క్యాన్సిల్ అయిందంటూ చాలా కథనాలు వచ్చాయి. ఎట్టకేలకు ఈ పుకార్లపై క్లారిటీ వచ్చింది. స్వయంగా విశాల్ తండ్రి, ఈ పుకార్లపై స్పందించారు.

చెన్నైలో జరిగిన ఓ సినిమా ఫంక్షన్ లో విశాల్ తండ్రి జీకే రెడ్డి…. తనయుడి పెళ్లిపై స్పందించారు. అన్నీ అనుకున్నట్టు జరుగుతాయని తెలిపిన రెడ్డి, విశాల్-అనీషా రెడ్డిల నిశ్చితార్థం రద్దయిందనే పుకార్లను ఖండించారు. తేదీపై తర్జనభర్జన పడుతున్నామని, మంచి డేట్ చూసి పెళ్లి చేస్తామని క్లారిటీ ఇచ్చారు జీకే రెడ్డి. చెన్నైలో జరిగిన దమయంతి సినిమా ఫంక్షన్ లో రెడ్డి ఇలా స్పష్టత ఇచ్చారు.

ఈ ఏడాది మార్చిలో విశాల్, హైదరాబాద్ కు చెందిన అనీషా రెడ్డిల నిశ్చితార్థం జరిగింది. అక్టోబర్ 9న వీళ్లిద్దరి వివాహం ఉంటుందని అప్పట్లోనే ప్రకటన వచ్చింది. కానీ అక్టోబర్ 12 వచ్చినా వివాహం మాటెత్తలేదు విశాల్ ఫ్యామిలీ. పైగా తన సోషల్ మీడియా ఖాతా నుంచి అనీషా ఫొటోల్ని విశాల్ తీయడం అనుమానాలకు తావిచ్చింది.

అయితే ఎవ్వరూ అనుమానించాల్సిన అవసరం లేదని, త్వరలోనే పెళ్లి ఉంటుందని ప్రకటించారు జీకే రెడ్డి. అయితే గతంలో విశాల్ ప్రకటించినట్టు నడిగర్ సంఘం బిల్డింగ్ లోనే విశాల్ పెళ్లి చేసుకుంటాడా లేక వేదిక మారుతుందా అనేది త్వరలోనే తెలుస్తుంది.