తమన్న తప్పుకోవడానికి కారణం అదే!

రాజుగారి గది-3 సినిమా ఓపెనింగ్ కు కూడా వచ్చింది తమన్న. అంతకంటే ముందు జరిగిన స్టోరీ డిస్కషన్లలో ఆమె పాల్గొంది. కథ నచ్చి కాల్షీట్లు కూడా ఇచ్చింది. ఇక అంతా సెట్ అనుకున్న టైమ్ లో హఠాత్తుగా ప్రాజెక్టు నుంచి ఆమె తప్పుకుంది. దీంతో దర్శకుడు ఓంకార్, తమన్నకు మధ్య అభిప్రాయబేధాలు వచ్చాయంటూ చాలామంది పుకార్లు సృష్టించారు. ఎట్టకేలకు ఈ గాసిప్స్ పై స్పందించాడు దర్శకుడు ఓంకార్. తమన్న తప్పుకోవడంపై క్లారిటీ ఇచ్చాడు.

“ముందు ఈ సినిమాను తమన్నా గారితోనే మొదలు పెట్టాం. ఓపెనింగ్ కూడా అయింది. అయితే ఆమె డేట్స్ కారణంగా తప్పుకున్నారు. అప్పటికే రెండు షెడ్యూల్స్ లేట్ అయ్యాయి కూడా. అక్టోబర్ విడుదల పెట్టుకోవడంతో ఇంకా తమన్నా గారి కోసం వేచి చూస్తే బాగోదని వదిలేసుకున్నాం. ఆమె లాంటి స్టార్ ఇమేజ్ ఉన్న నటి కోసం చూసాం కానీ వాళ్ల డేట్స్ కూడా కుదర్లేదు. అలాంటి సమయంలో అవికా గోర్ వచ్చింది. ఆమె సినిమాకు చాలా పెద్ద ప్లస్ అయింది. అవికా గోర్ ఎక్స్‌ట్రార్డినరీగా చేసింది. చాలా రోజుల తర్వాత తెలుగులోకి రీ ఎంట్రీ ఇస్తుంది. కచ్చితంగా అలరిస్తుంది ఆమె కారెక్టర్.”

ఇలా తమన్న తప్పుకునే అంశంపై తనదైన శైలిలో స్పందించాడు ఓంకార్. నిజానికి సైరా సినిమా షెడ్యూల్స్ గందరగోళం అవ్వడంతో పాటు, అదే టైమ్ లో ఓ చిన్న బాలీవుడ్ సినిమాకు ఆమె కాల్షీట్లు ఇచ్చింది. ఈ విషయం ఓంకార్ కు కూడా తెలుసు. కానీ సైరా పేరును ఓంకార్ ప్రస్తావించలేదు. కేవలం డేట్స్ సర్దుబాటు కాక తప్పుకుందని మాత్రమే ప్రకటించి, ఈ వివాదానికి ఇంతటితో ఫుల్ స్టాప్ పెట్టాడు.