దసరా సెలవులు…. విద్యార్థుల తల్లిదండ్రులకు గందరగోళం

తెలంగాణ ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తున్న నేపథ్యంలో పాఠశాలలకు ఈ నెల 19 వరకు దసరా సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. సెలవు రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు తరగతులు నిర్వహించరాదని ఆ ఉత్తర్వుల్లో పేర్కొంది. అంతే కాకుండా ఉత్తర్వులను ఉల్లంఘిస్తూ పాఠశాలలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విద్యాశాఖ కూడా స్పష్టం చేసింది.

కాగా, కొన్ని పాఠశాలలు సోమవారం నుంచి తరగతులు నిర్వహిస్తున్నామని విద్యార్థుల తల్లిదండ్రులకు సెల్ ఫోన్ సందేశాలు పంపాయి. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు గందరగోళంలో పడ్డారు. ఒకవైపు ప్రభుత్వం పాఠశాలలు నిర్వహించొద్దని చెబుతోంటే.. కొన్ని పాఠశాలలు మాత్రం ఇలా మెసేజెస్ చేశాయి. ఇది తీవ్ర గందరగోళానికి దారి తీసింది.

మరోవైపు సోమవారం నుంచి తెలంగాణలో గురుకుల పాఠశాల విద్యార్థులకు తరగతులు ప్రారంభమవుతాయని.. ఎలాంటి సెలవుల పొడిగింపు లేదని గురుకుల పాఠశాలల సొసైటీ కార్యదర్శి ప్రవీణ్ కుమార్ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ఉత్తర్వులు కూడా జారీ చేశారు.