పార్టీకి దూరంగా స్వామి గౌడ్‌…. కారణం ఇదేనా?

స్వామి గౌడ్ ఎక్కడ? శాసనమండలి మాజీ ఛైర్మన్‌ స్వామిగౌడ్‌ కొన్నాళ్లుగా పొలిటికల్‌ ఫ్లాట్‌ఫామ్‌ పై కనిపించడం లేదు. గత కొద్ది నెలలుగా పార్టీలో కానీ…. ఇతర కార్యక్రమాల్లో గానీ కనిపించని స్వామి గౌడ్… కేవలం ఇంటికే పరిమితమయ్యారు. ఆయన యాక్టివ్‌ పాలిటిక్స్‌కు ఎందుకు దూరమయ్యారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

ఎమ్మెల్సీగా స్వామిగౌడ్‌ పదవీ కాలం ముగిసింది. శాసనమండలి ఛైర్మన్‌గా బాధ్యతల నుంచి స్వామిగౌడ్‌ తప్పుకున్నారు. అప్పటినుంచి ఆయన ఏ పొలిటికల్‌ ప్లాట్‌ఫామ్‌పై కనిపించడం లేదు. సైలెంట్‌గా ఉంటున్నారు. ఆయన ఎందుకు సైలెంట్‌మోడ్‌లో ఉన్నారనే విషయంపై చర్చ నడుస్తోంది. పార్టీ పెద్దలు పట్టించుకోక పోవడంతో ఆయన సైలెంట్‌ అయ్యారనే ప్రచారం నడుస్తోంది.

ఉద్యమం లో కీలకంగా వ్యవహరించిన స్వామి గౌడ్‌ కు తెలంగాణ తొలి శాసన మండలి ఛైర్మన్‌ పదవిని కేసీఆర్‌ కట్టబెట్టారు. ఆ పదవి ముగుస్తున్న టైమ్‌లోనే రాజేందర్ నగర్ ఎమ్మెల్యే టికెట్‌ కోసం ట్రై చేశారు. కానీ ఆ ప్రయత్నాలు సఫలం కాలేదు. దీంతో ఎమ్మెల్సీ పదవినే రెన్యూవల్ చెయ్యాలని టిఆర్ ఎస్ పెద్దలను కోరారు.

అయితే స్వామిగౌడ్‌ విన్నపాన్ని పార్టీ పెద్దలు పట్టించుకోలేదు. మరోవైపు సీఎం కేసీఆర్ అపాయింట్‌మెంట్‌ దొరకకపోవడంతో తీవ్ర నిరాశకు గురైన స్వామి గౌడ్ సైలెంట్ అయినట్లు తెలుస్తోంది.

ఈ మధ్య కాలంలో పదవుల్లో లేని టీఆర్ ఎస్ నాయకులకు పదవులు ఇస్తాం అని ఓ ప్రెస్‌నోట్‌ రిలీజ్‌ అయింది. అందులో స్వామి గౌడ్‌ పేరు లేకపోవడంతో ఆయన తీవ్ర నిరాశ చెందినట్లు సమాచారం.

అయితే అసెంబ్లీ ఎన్నికల టైమ్‌లో బీజేపీ, కాంగ్రెస్ నేతలతో ఆయన టచ్‌లోకి వెళ్లారని… ఈ సమాచారం తెలిసే గులాబీ బాస్‌ ఆయన్ని పక్కనపెట్టారని టీఆర్‌ఎస్‌ నేతలు కొందరు చెబుతున్నారు.