ఆర్టీసీ సమ్మెపై మోడీ ఆరా…. ఢిల్లీకి గవర్నర్ తమిళిసై

ఆర్టీసీ కార్మికుల సమ్మె 11వ రోజుకు చేరింది. కాని ఇంత వరకు ప్రభుత్వం వైపు నుంచి సరైన స్పందన లేదు. ఇప్పటికే ఇద్దరు కార్మికులు ఆత్మహత్య చేసుకోవడంతో ప్రజల్లో కూడా ఆర్టీసీ కార్మికుల పట్ల సానుకూల వాతావరణం కనపడుతోంది. అయితే మంత్రులు రెచ్చగొట్టే తరహా వ్యాఖ్యలు చేయడం తప్ప సమ్మె విరమణకు ఏం చేయాలనే దానిపై ముందడుగు పడటం లేదు.

ఈ నేపథ్యంలో ఆర్టీసీ సమ్మె, కార్మికుల ఆత్మహత్యలు, ప్రభుత్వ తీరుపై ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షా ఆరాతీసినట్లు తెలుస్తోంది. సమ్మెపై వెంటనే నివేదిక తయారు చేసి వెంటనే ఇవాళ తీసుకొని రావాలని గవర్నర్ తమిళిసైని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు మంగళవారం మధ్యాహ్నం గవర్నర్ ఢిల్లీ బయలుదేరి వెళ్లారు.

మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాని మోడీతో సమావేశమై తన నివేదికను సమర్పించనున్నారు. ఆ తర్వాత అమిత్‌షాతో భేటీ అవుతారు. రాష్ట్రంలో సమ్మె ప్రభావం, శాంతి భద్రతల గురించి మంత్రికి వివరిస్తారు. అలాగే సమ్మెపై ప్రభుత్వానికి ఎలాంటి ఆదేశాలు ఇవ్వాలనే దానిపై కూడా గవర్నర్‌కు దిశానిర్థేశం చేయనున్నట్లు సమాచారం.

గవర్నర్ తమిళిసై కేంద్రానికి ఇచ్చే నివేదిక ఆధారంగా ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. కాగా, కేంద్ర ప్రభుత్వం కలుగజేసుకునే వరకు తెలంగాణ ప్రభుత్వం వేచి ఉంటుందా…. లేదా వెంటనే స్పందిస్తుందా అనేది వేచి చూడాలి.