మారేడుమిల్లి ఘాట్‌లో ఘోర ప్రమాదం.. ఏడుగురు మృతి

తూర్పుగోదావరి జిల్లా చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడ్డులో ఇవాళ ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. భద్రాచలం నుంచి అన్నవరం దైవ దర్శనానికి వెళ్తున్న ఒక టెంపో వాల్మీకి కొండ సమీపంలో…. లోయలో పడిపోవడంతో ఆరుగురు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందగా.. ఆసుపత్రికి తరలిస్తుండగా మరొకరు చనిపోయారు. మరో ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. టెంపో ప్రమాదానికి గురైన సమయంలో 12 మంది దానిలో ప్రయాణిస్తున్నట్లు సమాచారం.

ప్రమాద ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను చికిత్స నిమిత్తం రంపచోడవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరంతా కర్ణాటకలోని చిత్రదుర్గం జిల్లా చెలకెరి గ్రామస్తులుగా పోలీసులు గుర్తించారు. భద్రాచలంలో దర్శనం ముగించుకొని అన్నవరం వెళ్తున్నారు.

కాగా, తూర్పు కనుమల్లో భాగమైన చింతూరు – మారేడుమిల్లి ఘాట్ రోడు చాలా ప్రమాదకరమైనంది. ఇటీవల భారీ వర్షాలకు ఈ రహదారి మరింత ప్రమాదకరంగా తయారైంది. నిపుణులైన డ్రైవర్లు మినహా కొత్త వారు ఈ మార్గంలో నడిపితే ప్రమాదాలకు గురవుతారని స్థానికులు చెబుతున్నారు. ఇవ్వాల్టి ప్రమాదం కూడా అనుభవరాహిత్యంతోనే జరిగి ఉండొచ్చునని పోలీసులు చెబుతున్నారు.