Telugu Global
NEWS

రివర్స్ స్వింగ్ కింగ్ మహ్మద్ షమీ

భారత ఫాస్ట్ బౌలర్ పై ప్రశంసల వర్షం నాలుగో ఇన్నింగ్స్ లో వికెట్ల మొనగాడు షమీ విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలిటెస్టులో ఆతిథ్య భారత్ కు అలవోక విజయం అందించడంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. రివర్స్ స్వింగ్ లో మహ్మద్ షమీని మించిన మొనగాడు మరొకరు లేరంటూ ఓపెనర్ రోహిత్ శర్మ కితాబిస్తే…నాలుగో ఇన్నింగ్స్ లో వికెట్లు తీయటంలో షమీకి షమీ మాత్రమే సాటని భారత బౌలింగ్ కోచ్ భరత్ […]

రివర్స్ స్వింగ్ కింగ్ మహ్మద్ షమీ
X
  • భారత ఫాస్ట్ బౌలర్ పై ప్రశంసల వర్షం
  • నాలుగో ఇన్నింగ్స్ లో వికెట్ల మొనగాడు షమీ

విశాఖ వేదికగా సౌతాఫ్రికాతో ముగిసిన తొలిటెస్టులో ఆతిథ్య భారత్ కు అలవోక విజయం అందించడంలో ప్రధానపాత్ర వహించిన ఫాస్ట్ బౌలర్ మహ్మద్ షమీపై ప్రశంసల వర్షం కురుస్తోంది.

రివర్స్ స్వింగ్ లో మహ్మద్ షమీని మించిన మొనగాడు మరొకరు లేరంటూ ఓపెనర్ రోహిత్ శర్మ కితాబిస్తే…నాలుగో ఇన్నింగ్స్ లో వికెట్లు తీయటంలో షమీకి షమీ మాత్రమే సాటని భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అంటున్నారు.

మరోవైపు పాక్ ఫాస్ట్ బౌలింగ్ దిగ్గజం షోయబ్ అక్తర్ సైతం..షమీ బౌలింగ్ తీరును ఆకాశానికి ఎత్తేశాడు. తాను ఇచ్చిన సలహాలు,సూచనలు, చిట్కాలతోనే షమీ రాటుదేలాడని అక్తర్ గుర్తు చేశాడు.

విశాఖటెస్టులో షమీ విశ్వరూపం…

విశాఖ పట్నంలోని ఆంధ్రక్రికెట్ సంఘం స్టేడియం వేదికగా జరిగిన టెస్ట్ తొలిఇన్నింగ్స్ లో ఒక్క వికెట్టు సాధించలేకపోయిన షమీ..రెండో ఇన్నింగ్స్ లో మాత్రం చెలరేగిపోయాడు. పేస్ బౌలింగ్ కు ఏమాత్రం అనువుగాలేని…జీవంలేని ఆఖరిరోజు వికెట్ పై పేస్ ,బౌన్స్ కు రివర్స్ స్వింగ్ ను జోడించిన షమీ 35 పరుగులకే 5 వికెట్లు పడగొట్టి…భారత్ కు భారీవిజయం అందించాడు.

సౌతాఫ్రికా వన్ డౌన్ ఆటగాడు బవుమా, కెప్టెన్ డూప్లెసి, ఎటాకింగ్ బ్యాట్స్ మన్ క్వింటన్ డీ కాక్ తో సహా నలుగురు బ్యాట్స్ మన్ ను క్లీన్ బౌల్డ్ గా పడగొట్టాడు.

నాలుగో ఇన్నింగ్స్ లో…..

గంటకు 140 కిలోమీటర్ల సగటు వేగంతో బౌలింగ్ చేసే షమీ…అనూహ్యమైన బౌన్స్ తో కూడిన విశాఖ లాంటి వికెట్ల పైన అత్యంత ప్రమాదకరమైన బౌలర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.

కొత్తబంతి కంటే…పాత బంతితోనే అత్యధిక వికెట్లు పడగొట్టిన భారత బౌలర్ గా షమీకి రికార్డు ఉంది. బంతిని రివర్స్ స్వింగ్ చేసే నైపుణ్యమే షమీని స్ట్రయిక్ బౌలర్ గా నిలబెట్టిందని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ భావిస్తున్నారు.

అంతేకాదు…2018 నుంచి సౌతాఫ్రికా, ఆస్ట్ర్రేలియా, ఇంగ్లండ్, విండీస్ దేశాల పర్యటనలకు వెళ్లిన సమయంలో షమీ పడగొట్టిన మొత్తం 58 వికెట్లలో 37 వికెట్లు నాలుగో ఇన్నింగ్స్ లో సాధించినవే కావడం గమనార్హం.

టెస్ట్ మ్యాచ్ ఆఖరి ఇన్నింగ్స్ లో షమీ స్ట్ర్రయిక్ రేట్ 63.8 శాతం ఉండటం చూస్తే…భారత బౌలింగ్ ఎటాక్ కు షమీ ఎంత కీలకమో మరి చెప్పాల్సిన పనిలేదు.

క్లీన్ బౌల్డ్ ల్లో ఘనుడు…

బ్యాట్స్ మన్ ను అవుట్ చేయటానికి ఎన్నో మార్గాలు.అయితే…క్లీన్ బౌల్డ్ గా పడగొట్టడంలో ఉన్న మజాయే వేరు. బ్యాట్స్ మన్ ప్యాడ్ ను, బ్యాట్ ను మాత్రమే కాదు… ఫుట్ వర్క్ ను సైతం బద్దలు చేయడం ద్వారానే క్లీన్ బౌల్డ్ సాధించే సత్తా ఉంటుంది. అలాంటి పవర్ మహ్మద్ షమీ బౌలింగ్ లో చాలానే ఉంది.

ప్రస్తుత సమకాలీన టెస్ట్ క్రికెట్ లో క్లీన్ బౌల్డ్ ద్వారా అత్యధిక వికెట్లు సాధించిన అతికొద్దిమంది బౌలర్లలో షమీ ప్రధానబౌలర్ గా నిలిచాడు.

ప్రస్తుత సిరీస్ లోని విశాఖ టెస్టు వరకూ షమీ సాధించిన మొత్తం 158 వికెట్లలో 48 వికెట్లు క్లీన్ బౌల్డ్ రూపంలో సాధించినవే కావడం విశేషం. షమీ మొత్తం వికెట్లలో 30. 38 శాతం క్లీన్ బౌల్డ్ ద్వారా వచ్చినవే.

కరీబియన్ ఫాస్ట్ బౌలర్ షేనన్ గాబ్రియెల్ మొత్తం 41 క్లీన్ బౌల్డ్ సాధిస్తే..షమీ 48 క్లీన్ బౌల్డ్ వికెట్లు నమోదు చేశాడు.
2013లో కోల్ కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా వెస్టిండీస్ తో జరిగిన టెస్ట్ మ్యాచ్ ద్వారా అరంగేట్రం చేసిన షమీ ప్రస్తుత సిరీస్ లోని విశాఖ టెస్ట్ వరకూ… ఆడిన 43 టెస్టుల్లో 158 వికెట్లు సాధించాడు. ఐదుసార్లు ఐదేసి వికెట్లు చొప్పున పడగొట్టాడు. అత్యుత్తమంగా ఓ టెస్టులో 118 పరుగులిచ్చి 9 వికెట్లు సాధించాడు.

ప్రస్తుత సిరీస్ లోని మిగిలిన రెండుటెస్టుల్లోనూ షమీ ఇదేజోరు కొనసాగించి మ్యాచ్ విన్నర్ గా నిలవాలని కోరుకొందాం.

First Published:  14 Oct 2019 8:50 PM GMT
Next Story