అయోధ్య కేసులో ముగిసిన వాదనలు… మీడియా సంస్థలకు సుప్రీం కీలక ఆదేశాలు

దశాబ్దాలుగా నలుగుతూ వస్తున్న అయోధ్య వివాదానికి సంబంధించిన వాదనలు సుప్రీం కోర్టులో ముగిశాయి. త్వరలో పదవివిరమణ చేయనున్న చీఫ్‌ జస్టిస్‌ గొగొయ్ వరుసగా కేసు వాదనలు వింటూ వచ్చారు. పదవి విరమణ లోపే ఆయన తీర్పు చెప్పాలన్న ఉద్దేశంతో 40 రోజుల పాటు వాదనలు విన్నారు. నేటితో వాదనలు ముగిశాయి.

తీర్పును సుప్రీం కోర్టు రాజ్యాంగ ధర్మాసనం రిజర్వ్ చేసింది. లిఖిత పూర్వకంగా వాదనలు వినిపించేందుకు మరో మూడు రోజులు గడువు ఇచ్చింది.

అయోధ్య కేసు నేపథ్యంలో టీవీ చానళ్లకు సుప్రీం కోర్టు పలు మార్గదర్శకాలు జారీ చేసింది. రెచ్చగొట్టే విధంగా ఎలాంటి చర్చా కార్యక్రమాలను నిర్వహించవద్దని స్పష్టం చేసింది.

తీర్పు వచ్చాక సంబరాలకు సంబంధించిన ఎలాంటి దృశ్యాలను ప్రసారం చేయవద్దని ఆదేశించింది. అయోధ్యకు సంబంధించిన ఎలాంటి దృశ్యాలను ప్రసారం చేయకూడదని స్పష్టం చేసింది.