బాక్సాఫీస్.. ఈ వారం కూడా అంతేనా?

గడిచిన రెండు వారాలుగా మార్కెట్లో సరైన సినిమా లేదు. అప్పుడెప్పుడో అక్టోబర్ 2న సైరా వచ్చింది. ఆ తర్వాత మరో సినిమా రాలేదు. చాణక్య, ఆర్డీఎక్స్ లవ్ అంటూ రెండు సినిమాలు వచ్చినప్పటికీ అవి డిజాస్టర్లు అయ్యాయి. ఈ నేపథ్యంలో.. ఈ వీకెండ్ మరో 5 సినిమాలు క్యూ కట్టాయి. కనీసం వీటిలోంచి అయినా ఓ సినిమా ఆకట్టుకుంటే, ప్రేక్షకులకు కాస్తంత రిలీఫ్.

ఈ వారం థియేటర్లలోకి వస్తున్న సినిమాల్లో చెప్పుకోదగ్గ సినిమాలు రెండే. వాటిలో ఒకటి ఆపరేషన్ గోల్డ్ ఫిష్ కాగా, రెండోది రాజుగారి గది3. ఆది హీరోగా నటించిన సినిమా ఆపరేషన్ గోల్డ్ ఫిష్. అడివి సాయికిరణ్ తీసిన ఈ సినిమా కశ్మీర్ పండిట్ల ఊచకోత, ఉగ్రవాదం, దేశభక్తి లాంటి ఎలిమెంట్స్ చుట్టూ తిరుగుతుంది. ట్రయిలర్ కు మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమా రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.

ఈ మూవీతో పాటు థియేటర్లలోకి వస్తోంది రాజుగారి గది3. అన్నీ తానై ఓంకార్ తెరకెక్కించిన ఈ సినిమాలో ఆకట్టుకునే ఎలిమెంట్ ఏదైనా ఉందంటే అది టైటిల్ మాత్రమే. ఈ పేరు చూసి ఆడియన్స్ థియేటర్లకు వెళ్లాలి. అంతకుమించి సినిమాలో ఎట్రాక్షన్స్ ఏం లేవు. ఇప్పటికే చాలామంది వాడి పడేసిన హారర్ కామెడీ కాన్సెప్ట్ ఇది. కాకపోతే అవికా గౌర్, అశ్విన్ బాబు మంచి కామెడీ చేశారంటున్నాడు ఓంకార్.

ఈ రెండు సినిమాలతో పాటు కృష్ణారావు సూపర్ మార్కెట్, మళ్లీ మళ్లీ చూశా, సరోవరం అంటూ మరో 3 సినిమాలు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ఇవన్నీ చిన్న సినిమాలు. వీటిపై ఎవ్వరికీ ఎలాంటి అంచనాల్లేవ్. సో.. ఈ వీకెండ్ అంతో ఇంతో ఆకర్షించేవి రాజుగారి గది 3, ఆపరేషన్ గోల్డ్ ఫిష్ మాత్రమే. ఇవి కూడా ఫెయిలైతే, సైరాకు మరో వారం అదనంగా దొరుకుతుందన్నమాట.