జోహోర్ కప్ హాకీ ఫైనల్లో భారత్

  • సెమీస్ లో ఆస్ట్ర్రేలియాపై 5-1 గోల్స్ విజయం

మలేసియాలోని జోహోర్ బాహ్రు వేదికగా జరుగుతున్న 9వ సుల్తాన్ ఆఫ్ జోహోర్ కప్ అంతర్జాతీయ జూనియర్ హాకీ టోర్నీ ఫైనల్స్ కు గత ఏడాది రన్నరప్ భారత్ చేరుకొంది.

మలేసియాలోని టామాన్ డాయా హాకీ స్టేడియం వేదికగా ముగిసిన రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో భారత్ 5-1 గోల్స్ తో ఆస్ట్ర్రేలియాను చిత్తు చేయడం ద్వారా ఫైనల్లో చోటు ఖాయం చేసుకొంది.

ఏకపక్షంగా సాగిన ఈ పోరులో భారత కుర్రాళ్లు ఆల్ రౌండ్ గేమ్ తో చెలరేగిపోయారు. ఆట 26, 29 నిముషాలలో శిలానంద లాక్రా రెండుగోల్స్, 44వ నిముషంలో దిల్ ప్రీత్ సింగ్, 48వ నిముషంలో గురుసాహీబ్ జీత్ సింగ్, 50వ నిముషంలో మన్ దీప్ మోర్ సాధించిన గోల్స్ తో భారత్ విజేతగా నిలిచింది.

భారత్ తన ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ పోటీలో గ్రేట్ బ్రిటన్ తో తలపడనుంది. ఇప్పటికే ఫైనల్స్ చేరిన భారత్…ఆఖరి రౌండ్ రాబిన్ లీగ్ మ్యాచ్ ను ప్రాక్టీసుగా వినియోగించుకోనుంది.

గతేడాది ఇదే టోర్నీలో రన్నరప్ గా నిలిచిన భారత్…ప్రస్తుత 2019 టోర్నీలో మాత్రం బంగారు పతకం అందుకోవాలన్న పట్టుదలతో ఉంది.