Telugu Global
National

విజయ్‌కుమార్‌ నాయుడు అలియాస్ కల్కి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు

విజయకుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధ్యాత్మికం ముసుగులో కల్కి సాగించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏకకాలంలో కల్కి ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో అనేక విషయాలు బయటపడ్డాయి. విజయకుమార్‌ నాయుడు కుమారుడు కృష్ణనాయుడు, కోడలు ప్రీతినాయుడిని చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు. కల్కి భగవాన్, ఆయన భార్య పరారీలో ఉన్నారు. సోదాల్లో వందల ఎకరాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమంలో […]

విజయ్‌కుమార్‌ నాయుడు అలియాస్ కల్కి చుట్టూ బిగుస్తున్న ఉచ్చు
X

విజయకుమార్ నాయుడు అలియాస్ కల్కి భగవాన్ చుట్టూ ఉచ్చు బిగుస్తోంది. అధ్యాత్మికం ముసుగులో కల్కి సాగించిన వ్యవహారాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఏకకాలంలో కల్కి ఆస్తులపై ఐటీ అధికారులు దాడులు నిర్వహిస్తున్నారు. దాడుల్లో అనేక విషయాలు బయటపడ్డాయి. విజయకుమార్‌ నాయుడు కుమారుడు కృష్ణనాయుడు, కోడలు ప్రీతినాయుడిని చెన్నైలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిని పోలీసులు రహస్యంగా విచారిస్తున్నారు.

కల్కి భగవాన్, ఆయన భార్య పరారీలో ఉన్నారు. సోదాల్లో వందల ఎకరాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఆశ్రమంలో భారీగా విదేశీ కరెన్సీ కూడా స్వాధీనం చేసుకున్నట్టు వార్తలొస్తున్నాయి. ఆశ్రమానికి సంబంధించిన నిధులను దారి మళ్లించి కల్కి కుమారుడు కృష్ణ నాయుడు అనేక సంస్థల్లో పెట్టుబడులుగా పెట్టడంతో పాటు వందల ఎకరాల భూములను కొనుగోలు చేసినట్టు ఐటీ అధికారులు నిర్ధారణకు వచ్చారు.

విజయ్‌కుమార్ నాయుడు అలియాస్ కల్కి తొలినాళ్లలో బీమా సంస్థలో క్లర్క్‌గా పనిచేసేవాడు. ఆ తర్వాత ఉద్యోగం మానేసి కుప్పం నియోజకవర్గం రామకుప్పం వద్ద జీవాశ్రమం పేరుతో ఇంగ్లీష్ మీడియం స్కూల్‌ను ఏర్పాటు చేశాడు. ఆ తర్వాత అది దివాళా తీసింది. కొద్దికాలం పాటు కనిపించకుండాపోయిన విజయ్‌కుమార్ నాయుడు ఆ తర్వాత తాను విష్ణుమూర్తి పదో అవతారం కల్కిభగవాన్‌ను అంటూ వరదయ్యపాళెంలో ప్రత్యక్షమయ్యాడు.

ఐదు ఎకరాల్లో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. ఆ తర్వాత రామకుప్పలో ఉన్న జీవాశ్రమం కాస్త సత్యలోకంగా మారింది. ప్రధాన కార్యాలయం చెన్నైలో తెరిచారు. తన భార్య పద్మావతిని కూడా దైవసంభూతురాలిగా పరిచయం చేశాడు. కల్కి దంపతుల ఆశీర్వాదానికి ఒక రేటు, పాదం తాకాలంటే ఒక రేటు పెట్టి భారీగా వసూళ్లు చేశారు. విదేశీభక్తులను ఆకర్షించారు. దాంతో కల్కి వందల కోట్లకు పడగలెత్తాడు.

కల్కి సాధారణ దర్శనానికి ఐదు వేలు, ప్రత్యేక దర్శనం కోసం 25వేలు చెల్లించాల్సి ఉంటుంది. ఇంతలో కల్కికి కుమారుడు కృష్ణనాయుడు తోడయ్యాడు. ఆశ్రమ నిధులను ఆయన సొంతానికి మళ్లించేశాడు. 2008లో వరదయ్యపాలెం బత్తలపల్లంలో నిర్మించిన గోల్డెన్ సిటీ ప్రారంభం సందర్భంగా తొక్కిసలాటలో ఐదుగురు చనిపోయారు. అనేక మంది తీవ్రంగా గాయపడ్డారు. అప్పటి నుంచి కల్కి ఆశ్రమం రూపు మార్చుకుంటూ వచ్చింది. కల్కి ఆశ్రమాన్ని తొలుత గోల్డెన్ సిటీగా ఆ తర్వాత, ఏకం( వన్నెస్‌)గా పేరు మార్చారు. ఆర్థిక లావాదేవీలను కూడా తొలుత ఆశ్రమం పేరుతో నిర్వహించినా… ఆ తర్వాత గోల్డెన్ షెల్టర్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో సాగిస్తూ వచ్చారు.

మూడేళ్లుగా కల్కి ఆశ్రమంపై అనేక ఫిర్యాదులు వస్తున్నాయి. దాంతో రంగంలోకి దిగిన ఐటీ అధికారులు కూపీ లాగుతున్నారు. వరదయ్యపాలెంలోని కల్కి భగవాన్ ఆశ్రమాన్ని పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ప్రధాన ద్వారాన్ని మూసేశారు. అసలు కల్కి ఎక్కడున్నారన్న దానిపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

First Published:  17 Oct 2019 1:28 AM GMT
Next Story