కశ్మీర్‌లో దారుణ పరిస్థితులు : యాపిల్స్ వర్తకుడిని చంపిన ఉగ్రవాదులు

కశ్మీర్‌లో పరిస్థితిని సాధారణ స్థితికి తీసుకొని రావడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నా అక్కడ మాత్రం అలా కనిపించడం లేదు. ఆర్టికల్ 370 రద్దు తర్వాత స్థానికుల నుంచి వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో కేంద్రం అనేక ఆంక్షలు విధించింది. బయటి వ్యక్తులు కశ్మీర్‌కు రావడాన్ని నిషేధించారు. కాగా ఇటీవల కాలంలో ఆంక్షలు సడలించడంతో వ్యాపారులు, ఇతరులు కొంత మంది కశ్మీర్‌కు వెళ్లారు.

కాగా, కశ్మీర్‌లోనికి ప్రవేశించిన పలు ఇతర రాష్ట్రాల వ్యక్తులను ఉగ్రవాదులు టార్గెట్ చేశారు. గత వారం రోజుల్లో ముగ్గురు వ్యక్తులను ఉగ్రవాదులు కాల్చి చంపారు.

తాజాగా ఒక యాపిల్ వ్యాపారిపై షోపియాన్‌లో ఉగ్రవాదులు దాడి చేశారు. ఆ వ్యాపారితో పాటు ఉన్న చరణ్‌జీత్ సింగ్ అనే వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. అతడిని తొలుత పుల్వామా జిల్లా ఆసుపత్రికి తీసుకొని వెళ్లగా వైద్యులు మెరుగైన వైద్యం కోసం శ్రీనగర్‌లోని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రికి తీసుకొని వెళ్లారు. ప్రస్తుతం అతనికి చికిత్స అందిస్తున్నారు.

కశ్మీర్‌లో యాపిల్ వర్తకులు గత రెండున్నర నెలలుగా అడుగు పెట్టలేదు. అక్కడ మొబైల్ నెట్‌వర్క్‌లు పని చేయకపోవడంతో బయటి వ్యక్తులతో రైతులకు సంబంధాలు తెగిపోయాయి. అయితే అక్కడ సెల్‌ఫోన్ సర్వీసులు పునరుద్దరించిన తర్వాత కశ్మీర్‌కు వెళ్లిన వ్యాపారులను తీవ్రవాదులు టార్గెట్ చేశారు.

సరుకును తీసుకొని పోవడానికి వచ్చిన రాజస్థాన్ ట్రక్ డ్రైవర్, చత్తీస్‌గడ్ నుంచి పని కోసం వచ్చిన ఒక కూలీని ఇప్పటికే తీవ్రవాదులు చంపేశారు. తాజాగా పంజాబ్‌కు చెందిన యాపిల్ వ్యాపారిని కాల్చి చంపడంతో ఇతర వ్యాపారస్తులు కశ్మీర్ వెళ్లడానికి భయపడుతున్నారు.