భార్యతో విడాకులు తీసుకున్న మంచు మనోజ్

నటుడు మంచు మనోజ్ దంపతులు విడాకులు తీసుకున్నారు. ఈ విషయాన్ని మంచు మనోజ్ తన ట్విట్టర్‌ ద్వారా స్వయంగా వెల్లడించారు. తమ జంట విడాకులు తీసుకున్నట్టు వెల్లడించారు. వృత్తిపరమైన, వ్యక్తిగత ఇబ్బందులను అభిమానులతో పంచుకోవాలనుకుంటున్నానంటూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

తనకు, తన భార్య ప్రణతీరెడ్డి మధ్య ఉన్న బంధం ముగిసిందని చెప్పారు. చాలా సందర్భాల్లో తమ మధ్య మనస్పర్థలు వచ్చిన నేపథ్యంలో తాము విడిపోవాలని నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడించారు. విడిపోతున్నప్పటికీ ఒకరిపై మరొకరికి పూర్తిగా గౌరవం ఉందని మనోజ్ చెప్పారు. తామిద్దరం కలిసి ఉన్నంతకాలం తమ ప్రయాణం చాలా ఆనందంగా కొనసాగిందన్నారు.

వ్యక్తిగత కారణాల వల్ల కొద్దికాలంగా సినిమాలపై దృష్టి పెట్టలేకపోయానని ఇకపై తిరిగి సినిమాల్లో నటిస్తానని మనోజ్ వివరించారు.

‘కొంతకాలంగా నా మనసు బాగోకపోవడంతో.. పని మీద శ్రద్ధ పెట్టలేకపోయాను. అలాగే సినిమాల్లో నటించలేకపోయాను. ఈ సమయంలో నా కుటుంబం చాలా అండంగా నిలిచింది. వారు నా వెంట లేకపోతే ఈ కష్ట సమయాన్ని అధిగమించలేక పోయేవాడిని. నేను కష్ట సమయంలో ఉన్నప్పుడు బాసటగా నిలిచిన ప్రతి ఒక్కరికి రుణపడి ఉంటాను. నాకు తెలిసిన ఏకైక పని సినిమాల్లో నటించడం.. అందుకోసం నేను తిరిగొచ్చాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే నా అభిమానుల వల్లే. నా చివరి శ్వాస వరకు సినిమాల్లోనే కొనసాగుతాను. అందరికీ భగవంతుని ఆశీస్సులు ఉండాలి’ అని మనోజ్‌ కోరారు.

గతంలోనూ మంచు మనోజ్ దంపతులు విడాకులు తీసుకున్నారన్న వార్తలొచ్చాయి. కానీ అప్పట్లో వాటిని అతడు ఖండించారు. 2015లో వీరి వివాహం జరిగింది.