ఆ ముగ్గురిలో ఆర్టీసీ ఎండీ ఆయ‌నేనా ?

తెలంగాణ ఆర్టీసీకి కొత్త బాస్ రాబోతున్నారు. ఇన్నాళ్లు ఇంచార్జ్ ఎండీతో నెట్టుకొస్తున్నారు. ఆర్టీసీ స‌మ్మె నేప‌థ్యంలో హైకోర్టు స‌ర్కార్‌కు మొట్టికాయ‌లు వేసింది. ఆర్టీసీ ఎండీని వెంట‌నే నియ‌మించాల‌ని ఆదేశించింది.

కోర్టు ఆదేశాలతో కొత్త ఎండీని నియ‌మించే ప‌నిలో ప‌డింది తెలంగాణ స‌ర్కార్‌. ఆర్టీసీ ఎండీగా ఐపీఎస్ ఆఫీస‌ర్ ఉండ‌డం ఆన‌వాయితీ. ఈ నేప‌థ్యంలో కొత్త బాస్ ఎవరు అనేది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. ఇప్ప‌టికే ముగ్గురు సీనియ‌ర్ ఐపీఎస్ అధికారుల పేర్లను కేసీఆర్ ప‌రిశీలిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

సీనియ‌ర్ ఐపీఎస్ అధికారి స్టీఫెన్ ర‌వీంద్ర‌, పౌర‌స‌ర‌ఫ‌రాల శాఖ క‌మిష‌న‌ర్ ఆకున్ స‌భ‌ర్వాల్‌, గురుకుల పాఠ‌శాల క‌మిష‌న‌ర్‌గా ప్ర‌వీణ్ కుమార్ పేర్ల‌ను ప్ర‌భుత్వం ప‌రిశీలిస్తోంది. అయితే వీరిలో స్టీఫెన్ ర‌వీంద్ర వైపే ప్ర‌భుత్వం మొగ్గు చూపుతున్న‌ట్లు తెలుస్తోంది.

ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ ఏర్ప‌డిన త‌ర్వాత స్టీఫెన్ ర‌వీంద్ర ఇంటలిజెన్స్ చీఫ్‌గా వెళ‌తారని ప్ర‌చారం జ‌రిగింది. డిప్యూటేష‌న్ కోసం ఆయ‌న కేంద్రానికి ద‌ర‌ఖాస్తు పెట్టుకున్నారు. ఇటు తెలంగాణ సీఎం కేసీఆర్ కూడా ఆయ‌న డిప్యూటేష‌న్‌కు అంగీకరించారు. అయితే స్టీఫెన్ డిప్యూటేష‌న్‌కు కేంద్రం నో చెప్పటంతో ఆగిపోవాల్సి వచ్చింది.

తెలంగాణ ఉద్య‌మ స‌మ‌యంలో స్టీఫెన్ క‌ఠినంగా వ్య‌హ‌రించార‌ని విమ‌ర్శ‌లు ఉన్నాయి. సంక్షోభ, లా అండ్ ఆర్డ‌ర్ మెయిన్‌టెయిన్‌లో క‌ఠినంగా వ్య‌హ‌రించే స్టీఫెన్ అయితే ఆర్టీసీలో స‌మ‌స్య‌లు కొలిక్కి వ‌స్తాయ‌ని ప్ర‌భుత్వ పెద్ద‌లు భావిస్తున్నార‌ట‌. మొత్తానికి ఇవాళో రేపో ఉత్త‌ర్వులు వెలువ‌డే అవ‌కాశం మాత్రం క‌నిపిస్తోంది.