వీణా-వాణీలకు 17 ఏండ్లు.. భవిష్యత్ ఏంటి..?

అన్నాతమ్ములో.. అక్కాచెల్లెలో.. స్నేహితులో.. చాలా సఖ్యతగా ఉంటే.. వీళ్లెప్పుడూ విడిపోరురా అని అంటుంటారు. ఇక కవలలు పుడితే.. మీరు ఎప్పుడూ కలిసే ఉండాలి అని తల్లిదండ్రులు, బంధువులు కోరుకుంటారు. కాని గత 17 ఏండ్లుగా కలిసే ఉంటున్న వీణా-వాణీల గురించి తెలిసిన ప్రతి ఒక్కరు వీరు ఎప్పుడు విడిపోతారా అని అనుకున్నారు. ఎందుకో అందరికీ తెలుసు.. తలలు కలిసి పుట్టిన ఈ చిన్నారుల శరీరాలను విడదీయడానికి ఎన్నో ప్రయత్నాలు జరిగినా ఏవీ ముందడుగు వేయలేకపోయాయి.

16 అక్టోబర్ 2002లో మురళి దంపతులకు వీణా-వాణిలు జన్మించారు. దినసరి కూలీలైన వీరిద్దరూ ఈ అవిభాజ్య కవలలను చికిత్స నిమిత్తం హైదరాబాద్‌లోని నీలోఫర్ ఆసుపత్రికి తీసుకొని వచ్చారు. ఆ తర్వాత ఈ చిన్నారులు మూడో ఏటలో ఉన్నప్పుడు ఆ తల్లిదండ్రలు వీరిని ఆసుపత్రిలోనే వదిలేసి స్వగ్రామానికి వెళ్లిపోయారు. అప్పటి నుంచి నీలోఫర్ సిబ్బందే వీరి ఆలనాపాలనా చూశారు. ఈ చిన్నారుల బాధను ప్రభుత్వం దృష్టికి తీసుకొని వెళ్లగా 2006లో ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రి వైద్యులు, 2009లో సింగపూర్ వైద్యులు పరీక్షించి వీరిని విడదీయడానికి శస్త్ర చికిత్స చేస్తామని పచ్చజెండా ఊపారు.

కాని అప్పట్లో వారి ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని తల్లిదండ్రులు అంగీకరించలేదు. ఇక 2012లో లండన్‌కు చెందిన గ్రేట్ ఆర్మన్ స్ట్రీట్ హాస్పిటల్ వైద్యులు శస్త్ర చికిత్స చేస్తామని ముందుకు వచ్చారు. కాని ఇద్దరినీ కాపాడటానికి 80 శాతం మాత్రమే అవకాశం ఉందని ప్రభుత్వానికి చెప్పారు. ఈ ప్రతిపాదనకు తల్లిదండ్రులు అంగీకరించినా.. ఉమ్మడి ఏపీ ప్రభుత్వం మాత్రం అంగీకరించలేదు. ఇద్దరూ బతుకుతారని 100 శాతం భరోసా ఇస్తేనే శస్త్రి చికిత్సకు అంగీకరిస్తామని చెప్పింది.

ఇక ఆ తర్వాత తల్లిదండ్రులు తమ స్వగ్రామానికి వెళ్లిపోయారు. నీలోఫర్ చిన్నపిల్లల ఆసుపత్రి కావడంతో వీరిని స్టేట్ హోంకు తరలించింది. అప్పటి నుంచి వీరిద్దరూ అక్కడే ఉంటున్నారు. ప్రతీ ఏడాది పుట్టిన రోజు నాడు తల్లిదండ్రులు వచ్చి చూసి పోవడమే కాని…. ప్రతీ రోజు వీరిద్దరూ ఆ స్టేట్ హోంలోనే ఉంటున్నారు.

ప్రస్తుతం చదువును కూడా స్టేట్‌హోంలోనే కొనసాగిస్తున్నారు. 16 ఏండ్లు పూర్తి చేసుకున్న ఈ కవల సోదరిలు ఇకపై విడిపోయే అవకాశాలు కూడా దాదాపు శూన్యమే అని డాక్టర్లు అంటున్నారు. వారు జీవించినంత కాలం అలా గడపాల్సిందేనని చెబుతున్నారు. అయితే ఎలాగైనా తమ కూతుళ్లకు శస్త్ర చికిత్స చేసి విడదీయమని తండ్రి మురళి ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాడు.