భారత క్రికెట్లో సరికొత్త సంచలనం

  • 17 ఏళ్ల వయసులోనే ఫస్ట్ క్లాస్ డబుల్ సెంచరీ
  • విజయ్ హజారే ట్రోఫీలో యశస్వి జైస్వాల్ జోరు

ముంబై టీనేజ్ క్రికెటర్ యశస్వి జైస్వాల్ చరిత్ర సృష్టించాడు. దేశవాళీ వన్డే క్రికెట్ విజయ్ హజారే ట్రోఫీ టోర్నీలో …కేవలం 17 సంవత్సరాల వయసులోనే డబుల్ సెంచరీ బాదిన తొలి ఆటగాడిగా రికార్డుల్లోచోటు సంపాదించాడు.

బెంగళూరు వేదికగా జార్ఖండ్ జట్టుతో ముగిసిన విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్-ఏ పోటీలో…ముంబై ఓపెనర్ గా బ్యాటింగ్ కు దిగిన యశస్వి కేవలం 154 బాల్స్ లోనే 17 బౌండ్రీలు, 12 సిక్సర్లతో 203 పరుగులు సాధించడం ద్వారా తనకుతానే సాటిగా నిలిచాడు.

భారత క్రికెట్ చరిత్రలోనే ఈ ఘనత సాధించిన తొలి టీనేజర్ గా రికార్డుల్లో చేరాడు.

భారత అండర్ -19 జట్టు తరపున అసాధారణంగా రాణించడం ద్వారా 17 ఏళ్ల యశస్వి..ముంబై సీనియర్ జట్టులో చోటు సంపాదించాడు. 2019 సీజన్ విజయ్ హజారే టోర్నీ ద్వారా సీనియర్ క్రికెట్ అరంగేట్రం చేశాడు.

కేరళతో జరిగిన తొలిరౌండ్ మ్యాచ్ లో 113 పరుగులు,గోవాతో ముగిసిన రెండో రౌండ్ మ్యాచ్ లో 122 పరుగులు సాధించాడు. మూడో రౌండ్ మ్యాచ్ లో ఏకంగా ద్విశతకమే బాదాడు.

గతవారం కేరళ ఓపెనర్ సంజు శాంసన్ 212 పరుగుల నాటౌట్ స్కోరుతో సరికొత్త రికార్డు నెలకొల్పితే…ఇప్పుడు యశస్వి జైస్వాల్ కేవలం 17 సంవత్సరాల వయసులోనే డబుల్ సెంచరీ సాధించిన టీనేజ్ క్రికెటర్ గా గుర్తింపు తెచ్చుకొన్నాడు.