ఇంటర్వ్యూలు రద్దు చేసిన జగన్ సర్కార్

ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. 2020 జనవరి నుంచి ఏపీపీఎస్సీ ద్వారా భర్తీ చేసే అన్ని ఉద్యోగాలకు ఇంటర్వ్యూలను రద్దు చేశారు. కేవలం రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఉద్యోగాలు భర్తీ చేస్తారు.

ఎపీపీఎస్సీపై సమీక్ష నిర్వహించిన జగన్‌ మోహన్ రెడ్డి ఈ కీలక ఆదేశాలు జారీ చేశారు. ప్రతి ఏడాది జనవరిలో ఉద్యోగాల భర్తీకి క్యాలెండర్ రూపొందించాలని అధికారులకు సూచించారు. ఒక్క ఉద్యోగం కూడా దారి మళ్లడానికి వీల్లేదని… ప్రతి ఉద్యోగం పారదర్శకంగా ప్రతిభ ఆధారంగానే భర్తీ చేయాలని ఆదేశించారు. అత్యవసర సేవలకు సంబంధించిన ఉద్యోగాల భర్తీకి ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.

ఏపీపీఎస్సీ ద్వారా చేపడుతున్న ఉద్యోగాల భర్తీపై పదేపదే కోర్టుల్లో కేసులు నమోదు అవుతుండడంపైనా జగన్ ఆరా తీశారు. ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రాకుండానే ముందుగానే జాగ్రత్తలు తీసుకుని ఉద్యోగాల భర్తీ చేయాలని ఆదేశించారు.